సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20)లో గురువారం పరుగుల వరద పారిన మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌పై ముంబయి ఇండియన్స్ కేప్ టౌన్ పైచేయి సాధించింది. 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 248 పరుగులు సాధించింది. అనంతరం ఛేదనలో ప్రిటోరియా ఎనిమిది వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేప్ టౌన్ ఆది నుంచి దూకుడుగా ఆడింది . పవర్‌ప్లేలో 66 పరుగులు సాధించింది. వాండర్ డసెన్ (21; 9 బంతుల్లో)తో కలిసి రికెల్టన్ (90; 45 బంతుల్లో) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. డసెన్, లివింగ్‌స్టోన్ (12; 19 బంతుల్లో) స్వల్పవ్యవధిలోనే ఔటైనప్పటికీ బ్రెవిస్ (66; 32 బంతుల్లో) కలిసి రికెల్టన్ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు.

అయితే సెంచరీకి చేరువవుతున్న రికెల్టన్‌ను పార్నెల్ ఔట్ చేశాడు. ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన సామ్ కరన్ (22*; 12 బంతుల్లో), పొలార్డ్ (27*; 7 బంతుల్లో) ఆకాశమే హద్దుగా చెలరేగారు. పొలార్డ్ ఎదుర్కొన్న ఏడు బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదడం విశేషం. పార్నెల్ నాలుగు ఓవర్లలో 57 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం ఛేదనలో ప్రిటోరియా క్యాపిటల్స్ 42 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ముంబయి ఇండియన్స్ బౌలర్ల ధాటికి ప్రిటోరియా బ్యాటర్లు పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టారు. అయితే కైల్ వెర్రియన్ (116; 52 బంతుల్లో) మెరుపు శతకం సాధించాడు. చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. కైల్ తర్వాత జట్టులో అత్యధిక స్కోరు పార్నెల్ (23; 25 బంతుల్లో) సాధించిన 23 పరుగులే. కానీ కైల్ గొప్పగా పోరాడినప్పటికీ కొండంత లక్ష్యాన్ని సాధించలేకపోయాడు. ముంబయి ఇండియన్స్ కేప్ టౌన్ బౌలర్లలో తుషారా మూడు వికెట్లు, రబాడ రెండు వికెట్లు సాధించారు.