2023 నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి భారత క్రికెట్ అభిమానులనే కాకుండా, స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మను కూడా కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ సమయంలో ఆయన అనుభవించిన వేదన, ఆ తర్వాత సాధించిన విజయాల వెనుక ఉన్న పట్టుదల నిజంగా స్ఫూర్తిదాయకం. 2023 ప్రపంచ కప్ ఓటమి తర్వాత పూర్తిస్థాయిలో రిటైర్ అవ్వాలని తీవ్రంగా ఆలోచించినట్లు టీమిండియా స్టార్ క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వెల్లడించారు. "ఇక నా దగ్గర ఇచ్చేందుకు ఏమీ లేదు" అనే భావనతో ఉన్నానని ఆయన తెలిపారు. అయితే ఆ మానసిక పోరాటాన్ని అధిగమించి, భారత్‌ను 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాల వైపు నడిపించారు.
2023 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ పరాజయం పాలు కావడంతో కెప్టెన్ రోహిత్‌కు ఛాంపియన్‌షిప్ కల దూరమైంది. ఈ ఓటమి తనలోని సర్వం హరించుకుపోయిందని ఆయన తెలిపారు. ఆ పరాభవం తర్వాత వారాలపాటు అన్నింటికి దూరంగా ఉన్నానని.. అది తన క్రికెట్ జీవితంలోని చీకటి దశగా పేర్కొన్నారు.

గురుగ్రామ్‌లో ఓ కళాశాల కార్యక్రమంలో విద్యార్థులతో రోహిత్ పంచుకుంటూ.. "ఓటమిని తట్టుకోవడం కష్టం, కానీ ఓటమితోనే జీవితం అంతం కాదు. అది ఒక పాఠం. కొత్తగా ఎలా ప్రారంభించాలి అని ఆలోచించాను. 2024 టీ20 ప్రపంచ కప్‌పై దృష్టి పెట్టాలి. ఇప్పుడు చెప్పడం సులువు, అప్పుడు చాలా కష్టం" అని రోహిత్ శర్మ అన్నారు. "ఈ ఆట ఆడకూడదని అనుకున్నాను. ఎందుకంటే ఇది నా శరీరం నుంచి సమస్తాన్ని పీల్చేసింది, నా దగ్గర ఇచ్చేందుకు ఏమీ లేదు. నేను ప్రేమించి, కలలు కన్న ఈ ఆటను వదులుకోలేను. తిరిగి నిలబడటానికి చాలా సమయం, శక్తి అవసరమయ్యాయి" అని రోహిత్ భావోద్వేగంగా వివరించారు.
ప్రస్తుతం రోహిత్ టీ20, టెస్ట్ అంతర్జాతీయ క్రికెట్ల నుండి రిటైర్ అయ్యారు. ఈ ఏడాది వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించినా, 50 ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రం కొనసాగుతున్నారు. 2027 ప్రపంచ కప్‌లో మళ్లీ తుది ప్రయత్నం చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. 2011లో భారత్ ప్రపంచ కప్ గెలిచినప్పుడు రోహిత్ శర్మకు జట్టులో అవకాశం దక్కలేదు. అయితే ఆయన నాయకత్వంలో టీమిండియా 2007, 2024 టీ20 ప్రపంచ కప్‌లను, అలాగే 2013, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకుంది. ఈ విజయాలు రోహిత్ శర్మ కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి.