హైదరాబాద్: లంక పర్యటనలో కోహ్లీసేన ఆతిథ్య శ్రీలంకపై 9-0తో చిత్తుగా ఓడించి ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా తర్వాత అరుదైన రికార్డుని నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇంతటి గొప్ప విజయం అందుకున్నా ఏ జట్టు కెప్టెన్ అయినా కొద్దిరోజుల పాటు దానిని ఎంజాయ్ చేస్తాడు.
అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం అందుకు భిన్నం. శ్రీలంక పర్యటనను ముగించుకుని స్వదేశం వచ్చినప్పటికీ తన రోటీన్ పద్ధతినే ఫాలో అయ్యాడు. అంతేకాదు 'రెస్ట్ అనే పదానికే చోటివ్వలేదు. ఎప్పటిలాగే జిమ్‌లో కసరత్తులు చేశాడు. త్వరలో ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరిస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేశాడు.

దీనికి సంబంధించిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో షేర్ చేసుకున్నాడు. 'రెస్ట్ డే అంటే చీట్ డే' అంటూ కామెంట్ కూడా పెట్టాడు. కోహ్లీలో ఈ కష్టపడే మనస్తత్వమే అభిమానులకు అతడిని మరింత చేరువ చేసింది. కాగా, భారత్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడే ఆసీస్ జట్టులోని ఏడుగురు క్రికెటర్లు శుక్రవారం రాత్రి ఇక్కడకు చేరుకున్నారు.
కల్టర్ నైల్, ఫాల్క్‌నర్, ఫించ్, ట్రేవిస్ హెడ్, మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ ఆసీస్ నుంచి నేరుగా భారత్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య భారత్‌తో ఆస్ట్రేలియా జట్టు ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఐదు వన్డేల్లో భాగంగా తొలి వన్డే సెప్టెంబర్ 17న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది.