ఐపీఎల్-2025 మెగా వేలానికి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని కొన్ని ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది. రిటైన్డ్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్య పరిమితిని పెంచాలని మెజారిటీ ఫ్రాంచైజీలు ఓ నిర్ణయానికి వచ్చాయని సమాచారం. ఎనిమిది ప్లేయర్లను అట్టిపెట్టుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు జాతీయా మీడియలో వార్తలు వస్తున్నాయి.
ప్రతి మూడేళ్లకు ఒకసారి ఐపీఎల్ మెగా వేలాన్ని నిర్వహిస్తారు. గత మెగా వేలానికి ముందు నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశాన్ని ఫ్రాంచైజీలకు కల్పించారు. దాంతో పాటు రైట్ టూ మ్యాచ్ కార్డ్ కింద మరో ఆటగాడిని అదనంగా తమ జట్టుతో కొనసాగించుకోవచ్చు. అంటే మొత్తంగా అయిదుగురిని తమ జట్టులో ఉంచుకోవచ్చు. అందులో గరిష్ఠంగా ఇద్దరు విదేశీ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చు.

అయితే రిటైన్డ్ ఆటగాళ్ల పరిమితి పెంచాలని మెజారిటీ ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. తరుచూ జట్టును విచ్చిన్నం చేయడాన్ని సమంజసం కాదని వాదిస్తున్నాయి. జట్టులో ఎక్కువ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాయి. దీనిపై అన్ని ఫ్రాంచైజీలు ఏకాభిప్రాయానికి రావట్లేదని సమాచారం. ఎందుకంటే గత మెగా వేలం తర్వాత ఇబ్బందిపడిన ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చే ఆక్షన్‌లో జట్టును బలంగా నిర్మించాలని భావిస్తున్నాయి. దీంతో ఈ ఫ్రాంచైజీలు రిటైన్డ్ ప్లేయర్ల సంఖ్యను పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు స్ట్రాంగ్ టీమ్‌లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ను రిటైన్ ఆటగాళ్ల పరిమితిని పెంచాలని కోరుతున్నాయి. దీంతో అన్ని ఫ్రాంచైజీలు ఏకాభిప్రాయానికి రావట్లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ''కొన్ని ఫ్రాంచైజీలు వేలంలో ఎక్కువ మంది ఆటగాళ్లను తీసుకుని తమ జట్టును పునర్నిర్మించాలని భావిస్తున్నాయి. దీంతో కొంత ప్రతిఘటన ఏర్పడింది. ప్రస్తుతం పది జట్లు ఉన్నాయి. రిటైన్డ్ ప్లేయర్ల సంఖ్యను పెంచితే మెగా వేలం చాలా చిన్నదిగా మారే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాలపై ఏప్రిల్ 16న జరిగే సమావేశంలో చర్చించనున్నారు'' అని బీసీసఐ అధికారి ఒకరు తెలిపారు.