భారత జట్టు ప్రధాన కోచ్ పదవిపై ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి మరికొన్ని రోజులు మాత్రమే అవకాశం ఉంది. మే 27, సాయంత్ర 6 గంటలతో కోచ్ పదవికి అప్లై చేసే గడువు ముగుస్తుంది. రాహుల్ ద్రవిడ్ స్థానంలో సమర్థవంతమైన వ్యక్తికి టీమిండియా కోచ్ బాధ్యతలను అందివ్వాలని బీసీసీఐ భావిస్తుంది.
కోచ్ పదవి రేసులో కొందరు మాజీ క్రికెటర్ల పేర్లు గత కొన్నిరోజులుగా వినిపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్, ఆశిష్ నెహ్రాతో పాటు విదేశీ క్రికెటర్లు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ టీమిండియా కోచ్ బాధ్యతలు అందుకోవడానికి గట్టి పోటీలో ఉన్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కోచ్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌పై బీసీసీఐ ఆసక్తిగా ఉందని తెలుస్తుంది.

సీఎస్కేను అయిదు సార్లు ఛాంపియన్‌గా నిలపడంతో ధోనీతో పాటు ఫ్లెమింగ్‌ది కీలకపాత్ర. అయితే టీమిండియా కోచ్ పదవికి ఫ్లెమింగ్ ఇంకా దరఖాస్తు చేసుకోలేదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒత్తిడి ఉండే భారత జట్టు ప్రధాన కోచ్ పదవిని అందుకోవడానికి ఫ్లెమింగ్ సుముఖంగా లేడని తెలుస్తోంది. కానీ ఫ్లెమింగ్‌ను కోచ్‌గా నియమించాలని బీసీసీఐ పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఫ్లెమింగ్‌ను ఒప్పించడం కోసం ఎంఎస్ ధోనీని రంగంలోకి దించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఫ్లెమింగ్‌తో ధోనీ స్నేహబంధం కొనసాగుతోంది. అత్యంత సన్నిహితుడైన ధోనీ సిఫార్సు చేస్తే, ఫ్లెమింగ్ కాదనలేడని బీసీసీఐ భావిస్తుంది. దీంతో ఫ్లెమింగ్‌ను ఒప్పించే బాధ్యత తీసుకోవాలని ధోనీపై భారత క్రికెట్ బోర్డు ఒత్తిడి తీసుకురావడనికి ప్రయత్నిస్తోంది. మరి, బీసీసీఐ మాటను పరిగణించి ధోనీ ఫ్లెమింగ్‌ను ఒప్పిస్తాడా లేదా అని తెలియాలంటే మరికొన్ని రోజలు ఎదురుచూడాల్సిందే.
కాగా, టీమిండియాకు కొత్తగా ఎంపికయ్యే ప్రధాన కోచ్ పదవి కాలం మూడున్నరేళ్లు ఉంటుంది. 2027 డిసెంబర్ 31 వరకు కొనసాగుతారు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవి కాలం రానున్న టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనుంది. వాస్తవానికి 2023 వన్డే ప్రపంచకప్ అనంతరమే ద్రవిడ్ పదవి కాలం ముగిసింది. కానీ పొట్టి కప్‌ను దృష్టిలో పెట్టుకుని ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడగించారు.