టీ20 వరల్డ్ కప్-2024 ఛాంపియన్‌గా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇచ్చాయి. అయితే ఈ మహా సమరాన్ని నిర్వహించిన ఐసీసీ ఆర్థికంగా భారీ నష్టాన్ని చవిచూసిందని సమాచారం. సుమారు రూ.167 కోట్లు నష్టం వచ్చిందని తెలుస్తోంది.
యూఎస్ఏలో లీగ్ దశ మ్యాచ్‌లు మాత్రమే నిర్వహించారు. అయితే అక్కడ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మినహా మిగిలిన పోరులకు ఆదరణ కరువైంది. మరోవైపు వెస్టిండీస్‌లో దాదాపు అదే పరిస్థితి ఎదురైంది. భారత్ అభిమానుల కోసం టోర్నీలో చాలా మ్యాచ్‌లు వెస్టిండీస్‌లో ఉదయానే నిర్వహించారు. అది పెద్దగా వర్కౌట్ కాలేదు. అంతేగాక నిర్వహణకు భారీగా ఖర్చు పెట్టడం కూడా నష్టాల బాట పట్టేలా చేసిందని తెలుస్తోంది.

అయితే ఈ విషయాలపై రేపటి నుంచి కొలంబో వేదికగా ప్రారంభం కానున్న వార్షిక సమావేశాల్లో చర్చించనున్నారు. తొమ్మిది పాయింట్ల ఎజెండాలో ఇది లేనప్పటికీ నష్టం గురించి ప్రధానంగా చర్చ సాగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశానికి బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా హాజరకానున్నాడు. కాగా, జులై 19 నుంచి 22వరకు జరగనున్న వార్షిక సమావేశాల్లో ఐసీసీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ స్థానాల కోసం పదకొండు మంది పోటీపడుతున్నారు. ఎన్నికైన వాళ్లు రెండేళ్ల కాలపరిమితి కలిగి ఉంటారు. అయితే సమావేశాల్లో ఐసీసీ కొత్త ఛైర్మన్ గురించి, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్‌కు భారత్ వెళ్తుందా లేదా అనే విషయాలపై చర్చ సాగనుంది. ఈ ఏడాది నవంబర్‌లో ఐసీసీ కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్‌లే ఐసీసీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నాడు.
ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకోవాలని జై షా భావిస్తే దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికవుతాడు. మరోవైపు ఛైర్మన్‌గా పదవి చేపట్టేందకు ఆసక్తి చూపకపోతే బార్క్‌లే 2025 వరకు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు టీమిండియా తప్పక తమ దేశంలో ఆడేలా చూడాలని ఐసీసీని వార్షిక సమావేశాల్లో పాకిస్థాన్ కోరనుంది. వచ్చే ఏడాది ఫ్రిబవరి పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే భారత్ జరిగే మ్యాచ్‌లకు పాక్‌లో కాకుండా తటస్థ వేదికను ఏర్పాట్లు చేయాలని బీసీసీఐ ఐసీసీకి స్పష్టం చేసింది. దీనిపై చర్చ జోరుగా సాగే అవకాశం ఉంది.