
హైదరాబాద్: వరుస వైఫల్యాల అనంతరం జట్టుకు కెప్టెన్‌గా ఉండబోనంటూ తప్పుకున్న గౌతం గంభీర్‌పై కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇటీవల టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను టెర్రరిస్ట్ అని సంబోధిస్తూ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ వివాదానికి తెరతీశాడు. పాకిస్థానీయులను భారత్‌లో అడుగు పెట్టనివ్వకుండా నిషేధించాలని ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గంభీర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.
గంభీర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆస్ట్రేలియా జర్నలిస్ట్ డెన్నిస్ ఫ్రీడ్‌మన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. గంభీర్ వెర్బల్ టెర్రరిస్ట్ అని ట్వీట్ చేయడం గంభీర్ క్రికెటర్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు ప్రమాదకరమంటూ గంభీర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టాడు. గంభీర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని, ఇది మంచిది కాదంటూ హితవు పలికాడు.
భారత క్రికెటర్లపై వ్యాఖ్యలు చేయడం, వివాదాల్లో నిలవడం ఆసీస్ జర్నలిస్ట్ డెన్నిస్ ఫ్రీడ్‌మన్‌కు కొత్తేమీ కాదంటూ భారత క్రికెట్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. గతంలో సచిన్‌ను సైతం కించపరిచేలా.. సచిన్ అంటే ఎవరూ అని రాసిఉన్న బ్లూ జెర్సీ ధరించి చేసిన పోస్టులు కలకలం రేపాయి.
దీంతో గంభీర్ అభిమానులే కాదు.. భారతీయ క్రికెట్ అభిమానులంతా సంఘటింతమై అతని కామెంట్లతో చివాట్లు పెడుతున్నారు. గంభీర్ వెర్బల్ టెర్రరిస్ట్ అయితే ఆస్ట్రేలియన్లు అసలుసిసలైన టెర్రరిస్టులని నెటిజన్లు ఫ్రీడ్‌మన్‌ను విమర్శిస్తున్నారు. 'ట్విటర్‌లో నువ్వు చేస్తున్న పనులు అన్నింటికంటే ప్రమాదకరం', 'డెన్నిస్.. ఇది జోక్ అనుకున్నావా! భారత్-పాక్ సంబంధాలు మరింత దారుణంగా తయారుకావాలని కోరుకుంటున్నావంటూ' ఆసీస్ జర్నలిస్ట్‌పై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.