హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్‌ని అందుకున్నాడు. గురువారం ప్రకటించిన బీడబ్ల్యూఎఫ్ ఫురుషుల సింగిల్స్ ర్యాంకింగ్ జాబితాలో రెండు స్థానాలను ఎగబాకి రెండో స్ధానంలో నిలిచాడు. ఈ ఏడాది కిదాంబి శ్రీకాంత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
డెన్మార్క్ ఓపెన్ గెలిచిన వారంలోనే ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించాడు. తద్వారా ఒక ఏడాదిలో నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన ఏకైక భారత షట్లర్‌గా కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఘనత సాధించిన సంగతి తెలిసిందే. ఇదే కిదాంబి శ్రీకాంత్‌కు మెరుగు పడేందుకు దోహదపడిందని అంటున్నారు.

మరోవైపు మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు రెండో ర్యాంక్‌ని నిలబెట్టుకోగా.. సైనా నెహ్వాల్ 11వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఇండోనేసియా ఓపెన్ టైటిల్ గెలిచిన కిదాంబి శ్రీకాంత్.. వారం వ్యవధిలోనే ఆస్ట్రేలియా ఓపెన్ ఆ తర్వాత జరిగిన డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ఇలా నాలుగు టైటిల్స్‌ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ అరుదైన గౌరవం దక్కనుంది. కిదాంబి శ్రీకాంత్ పేరుని పద్మశ్రీ పురస్కారానికి సిఫారసు చేశారు మాజీ క్రీడల మంత్రి విజయ్ గోయెల్. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి బుధవారం ఆయన లేఖ రాశారు.
ఇటీవల డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లలో విజేతగా నిలిచిన శ్రీకాంత్ ఒక ఏడాదిలో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కిదాంబి శ్రీకాంత్‌కు పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని ఆయన ప్రతిపాదన చేశారు.
పద్మ అవార్డు నామినేషన్స్ గడువు సెప్టెంబరు 15నే ముగిసినప్పటికీ... పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో విజయ్ గోయల్ తాజాగా ఈ లేఖ రాశారు. 'భారతదేశ యువతకి శ్రీకాంత్ ఐకాన్‌గా నిలిచాడు. తన విజయాలతో లక్షలాది మందిలో అతను స్ఫూర్తి నింపుతున్నాడు' అని అందులో పేర్కొన్నారు.
'మాజీ క్రీడల మంత్రినైన నన్ను.. చాలా మంది కిదాంబి శ్రీకాంత్ పేరుని ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు కోసం సిఫార్సు చేయాల్సిందిగా కోరారు. ఆ స్ఫూర్తి వారిలో కనిపించింది. అందుకే నేను కిదాంబి శ్రీకాంత్ పేరుని సిఫారసు చేస్తూ లేఖ రాశాను' అని విజయ్ గోయల్ వివరించారు.