
నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ అద్భుత విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇక చివరి రోజున ఇంగ్లాండ్ 299పరుగులను టీ20 తరహాలో ఆడి ఛేదించి అపురూప విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ మిడిలార్డర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో (92 బంతుల్లో 136 పరుగులు) విధ్వంస కాండకు మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. డ్రాగా ముగియాల్సిన మ్యాచ్‌ను గెలవాలనే ఉద్దేశంతో అత్యంత గొప్పగా ఇంగ్లాండ్ బ్యాటర్లు పోరాట పటిమ ప్రదర్శించారు. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తం 229 ఫోర్లు, 24సిక్సర్లు నమోదయ్యాయి.
మొత్తం 249బౌండరీలతో ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు నమోదైన టెస్ట్‌గా ఈ మ్యాచ్ నిలిచింది. ఇకపోతే 2004లో ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య సిడ్నీలో జరిగిన టెస్టు డ్రాగా ముగియగా ఆ మ్యాచ్‌లో 238 ఫోర్లు మరియు 4సిక్సర్లు నమోదయ్యాయి. మొత్తం 242బౌండరీలతో ఇప్పటివరకు అత్యధిక బౌండరీలు నమోదైన టెస్ట్‌గా పేరుండగా.. ఇక నాటింగ్ హామ్ టెస్ట్‌లో ఈ రికార్డ్ బద్ధలైంది. అప్పటి మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 241పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఇకపోతే ఫోర్ల సంఖ్య పరంగా ఇప్పటికీ అత్యధిక ఫోర్లు నమోదైన టెస్టుగా 2004నాటి టెస్ట్ రికార్డు కొనసాగుతుంది.
ఇక ఈ టెస్ట్ హై స్కోరింగ్ మ్యాచ్‌గా సాగింది. తొలుత న్యూజిలాండ్ 553పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (190), టామ్ బ్లండెల్ (106) అద్భుతమైన సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ మంచి పట్టు సాధించింది. ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ 176 పరుగులు చేయగా, ఒల్లీ పోప్ 145పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ 539పరుగులు చేయగలిగింది. తద్వారా న్యూజిలాండ్‌కు కేవలం 14పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు మిచెల్, విల్ యంగ్, డెవాన్ కాన్వే హాఫ్ సెంచరీలు చేయడంతో 284 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు 299 పరుగుల
లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇక చివరి రోజు 74ఓవర్లలో 299పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్ అలెక్స్ లీస్ (44) ధాటిగా ఆడుతూ.. మ్యాచ్ గమనాన్ని డ్రా దిశగా కాకుండా విన్నింగ్ దిశగా నడిపించాలనే ఇంటెంట్ క్రియేట్ చేశాడు. అయితే 93 పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లాండ్ ఇక డ్రా కోసం ఆడుతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా బెయిర్‌స్టో, స్టోక్స్ టీ20 తరహాలో రెచ్చిపోయారు. వీరిద్దరు కేవలం 121పరుగులకే 179 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లాండ్‌కు అద్వితీయ విజయాన్ని అందించారు. బెయిర్‌స్టో 136 పరుగుల వద్ద ఔటయినా.. స్టోక్స్ చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. స్టోక్స్ సైతం 70 బంతుల్లో 75పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టుల్లో ఇదే అత్యధిక విజయవంతమైన ఛేజింగ్. ఈ విజయంతో ఇంగ్లాండ్ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.