హైదరాబాద్: భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకుకు చేరుకున్నాడు. మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన తాజా ర్యాంకుల్లో రెండో స్ధానంలో నిలిచాడు. ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ (235) సాధించిన సంగతి తెలిసిందే.
ముంబై టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్ ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఇంకో టెస్టు మిగిలుండగానే 3-0తో భారత్ కైవసం చేసుకుంది. అంతేకాదు ముంబై టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ముంబై టెస్టులో రాణించడంతో కోహ్లీ టెస్టుల్లో తన ర్యాంకుని మెరుగుపరుచుకున్నాడు. ఐసీసీ మంగళవారం ప్రకటించిన తాజా ర్యాంకుల్లో 897 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత 886 పాయింట్లతో కెప్టెన్ కోహ్లీ రెండో స్ధానంలో నిలిచాడు.
854 పాయింట్లతో మూడో స్ధానంలో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ ఉండగా, 817 పాయింట్లతో న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కొనసాగుతున్నాడు. ఐదో స్ధానాన్ని దక్షిణాఫ్రికా ఆటగాడు హషీం ఆమ్లా సొంతం చేసుకున్నాడు. ఇక వన్డేల్లో కోహ్లీ 2వ స్ధానంలో కొనసాగుతుండగా, ట్వంటీ20 ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్ధానంలో నిలిచాడు.
టెస్టుల్లో కోహ్లీ నెంబర్ వన్ ర్యాంకుకు చేరే ఛాన్స్ కూడా ఉంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 16 నుంచి చెన్నైలో ప్రారంభం కానుంది. ఈ టెస్టులో గనుక కోహ్లీ రాణిస్తే తప్పక నెంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకుంటాడు.
డిసెంబర్ 13, 2016 నాటికి ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకుల జాబితా:
1. Steve Smith (Australia) - 897 points
2. Virat Kohli (India) - 886
3. Joe Root (England) - 854
4. Kane Williamson (New Zealand) - 817
5. Hashim Amla (South Africa) - 791
6. AB de Villiers (South Africa) - 778
7. David Warner (Australia) - 772
8. Cheteshwar Pujara (India) - 756
9. Younis Khan (Pakistan) - 753
10. Jonny Bairstow (England) - 751