కోల్‌కతా: శ్రీలంకపై గురువారం జరిగిన వన్డేలో బౌలింగును తుత్తునియలు చేస్తూ చేసిన బ్యాటింగ్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. టెస్టు క్రికెట్‌లో వివియస్ లక్ష్మణ్ లాగానే వన్డేల్లో రోహిత్ శర్మకు కోల్‌కతా ఈడెన్ గార్డెన్ ప్రత్యేకం కానుంది. మొదట్లో జట్టులో కుదురుకోవడానికి ఇబ్బంది పడిన రోహిత్ శర్మ తర్వాతి కాలంలో భారత జట్టులో కీలకమైన ఆటగాడిగా మారిపోయాడు. ఇప్పుడిక తిరుగులేని క్రీడాకారుడిగా నిలిచిపోతాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ మాటల్లో చెప్పాలంటే వచ్చే ప్రపంచ పోటీలో తురుపు ముక్క కాబోతున్నాడు.
నిజానికి, ఆస్ట్రేలియాతో నిరుడు చేసిన విధ్వంసక బ్యాటింగ్ తర్వాతే రోహిత్ శర్మ అంటే ఏమిటో అర్థమైంది. ఆ ఇన్నింగ్సు తర్వాత అతను వెనుదిరిగి చూసుకోలేదు. మిడిలార్డర్‌లో కొట్టుమిట్టాడుతున్న రోహిత్ శర్మ ప్రతిభను గుర్తించి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రమోట్ చేశాడు. అప్పటి నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు. నిరుడు ఆస్ట్రేలియాను కంగారెత్తిస్తూ ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్ రోహిత్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది.

2013 నవంబర్ 2న బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. 156 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకుని వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఘనత సాధించిన మూడో భారత క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్ (200 నాటౌట్), వీరేంద్ర సెహ్వాగ్ (219) ఈ ఘనత సాధించారు. కెరీర్ తొలి రోజుల్లో రోహిత్ శర్మ ఎక్కువగానే ఇబ్బంది పడ్డాడు. జట్టులోకి ఇక రావడమే కష్టమనే పరిస్థితి కూడా వచ్చింది. అయితే, ఏ మాత్రం అదైర్యపడకుండా రీఎంట్రీ ఎవ్వడమే కాకుండా తిరుగులేని బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు.
ధోనీ ట్వీట్టర్ అభనందనలు
మొత్తంగా 125 వన్డేలు ఆడిన రోహిత్ 38.19 సగటుతో 3743 పరుగులు సాధించాడు. ఓపెనర్‌గా 40 ఇన్నింగ్స్‌ల్లో 43కి పైగా సగటుతో 1776 రన్స్ చేశాడు. అందుకే రోహిత్ రెండోసారి 'డబుల్' సాధించిన తర్వాత ధోనీ ట్విట్టర్‌లో అభినందన తెలిపాడు. శ్రీలంకతో సిరీస్‌కు దూరంగా ఉన్న ధోనీ - 'రోహిత్ అంటే ఇది. బాగా ఆడావ్ రోహిత్. ఇదో క్లాస్ యాక్షన్' అంటూ ట్వీట్ చేశాడు. 'వచ్చే వరల్డ్‌కప్‌లో రోహిత్ మా తురుపు ముక్క'అని కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో వన్డేకు ముందు చెప్పాడు. ఈ మాటల్లో ఏ మాత్రం అబద్ధం లేదని నిరూపిస్తూ శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో రోహిత్ డబుల్ సాధించాడు.
ఆ ముగ్గురూ కలిస్తే..
రాహుల్ ద్రావిడ్‌లోని టెక్నిక్, సచిన్ టెండూల్కర్‌లోని టైమింగ్, వీరేంద్ర సెహ్వాగ్‌లోని దూకుడు కలగలిస్తే రోహిత్ అంటూ మీడియా విశ్లేషిస్తోంది. నిరుడు ఆసీస్‌పై ఆడిన ఆటగానీ, శ్రీలంకపై డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ గానీ చూస్తే ప్రతీషాట్‌లో మనకు ఓ పర్‌ఫెక్ట్ బ్యాట్స్‌మెన్ దర్శనమిస్తాడని వ్యాఖ్యానిస్తున్నాయి. కచ్చితమైన టైమింగ్, షాట్ల ఎంపికలో పరిపక్వత, అన్నింటికీ మించి కొండంత ఓర్పు అతన్ని సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడేలా చేశాయి.
కెరీర్ ఆరంభంలో 30-40ల్లోపే అవుటయ్యే స్థాయి నుంచి 50 ఓవర్లపాటు నిలబడి సుదీర్ఘమైన ఇన్నింగ్స్‌లు ఆడగల సత్తా ఉన్న ఆటగాడిగా ఎదిగాడని వ్యాఖ్యానిస్తోంది. లంకపై రికార్డు డబుల్ సెంచరీ కొట్టిన తర్వాత రోహిత్ శర్మ అదే విషయం చెప్పాడు. 'నేనేమీ అలసిపోలేదు. మరో 50 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయడానికైనా సిద్ధమే' అని అన్నాడు.
ఫస్ట్‌క్లాస్, టెస్ట్ అరంగేట్రం, ఐపీఎల్‌లో సెంచరీ చేసిన ఈడెన్ గార్డెన్స్‌లోనే తాను ప్రపంచ రికార్డు నెలకొల్పడం చాలా ప్రత్యేకంగా ఉందని రోహిత్ చెప్పాడు. 150 ఏళ్ల సంబరాలు జరుపుకుంటున్న చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌కు మరింత ప్రత్యేకం.
ఎవరేమన్నారు..
రోహిత్ క్రీజులో కుదురుకున్నాడంటే అతన్ని ఆపడం కష్టమేనని నేను చెప్పినట్లే జరిగింది. రోహిత్ రికార్డు సమీప భవిష్యత్తులో బద్దలు కాకపోవచ్చు. ఈ మ్యాచ్‌లో అతనితో కలిసి బ్యాటింగ్ చేయడం నాకెంతో ఆనందాన్నిచ్చింది 80 పరుగుల తర్వాత అతన్నెవరూ ఆపలేకపోయారు. -విరాట్ కోహ్లీ
ఈ మ్యాచ్‌ని తిలకించడం గొప్ప అనుభూతి. ఇక ఈ రికార్డు బద్దలు కాదనే అనుకుంటున్నా. రోహిత్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. చరిత్ర సృష్టించిన సోదరునికి అభినందనలు. -హర్భజన్ సింగ్
రోహిత్ గొప్పగా ఆడాడు. ఇక అతని తదుపరి లక్ష్యం ఐపీఎల్‌లో డబుల్ సెంచరీ కావొచ్చు - మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే
ఈ రోజు రోహిత్ అజేయంగా నిలిస్తే 250+ పరుగులు చేస్తాడనే అనుకున్నా - ధోనీ
రోహిత్ ప్రదర్శనను నమ్మలేకపోతున్నా. భవిష్యత్‌లో అతను ట్రిపుల్ సెంచరీ కూడా చేస్తాడేమో - మైకేల్ వాన్
ఆటగాళ్లు ఇలాంటి ప్రదర్శన చేస్తే ఏ జట్టుకైనా గెలుపు సులువే - హర్షా భోగ్లే