బెంగళూరు: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ ఆడకపోవడం క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా విఫలం కావడం వల్లే గేల్‌ను ఆడించలేదేమో అనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, గేల్ ఆడకపోవడానికి గల అసలు కారణం ఇది అంటూ బెంగళూర్ ఆటగాడు అక్బాల్ అబ్దుల్లా వివరించాడు.
గేల్ తనంతట తానుగానే ఈ మ్యాచ్ ఆడలేదని చెప్పాడు. తదుపరి మ్యాచుల్లో అభిమానులను ఆకట్టుకునేలా ఆడేందుకు అతను ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని చెప్పాడు. మిగతా మ్యాచుల్లో గేల్ రాణిస్తాడని అబ్దుల్లా ఆశించాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూర్పులో క్రిస్ గేల్ లేకపోవడం పట్ల చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా కూడా అశ్చర్యం వ్యక్తం చేశాడు. చెన్నై - బెంగళూరు మ్యాచ్ అనంతరం రైనా దీనిపై స్పందించాడు. గేల్ ఆడకపోవడం పట్ల తాను ఎంతో ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పాడు.
కాగా, బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ లేకపోవడం చాలామందిని నిరాశపరిచిందనే చెప్పవచ్చు. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఆడటం లేదని చెప్పారు. దీంతో చాలామంది ప్రేక్షకులు ఆశ్చర్యపోయారని చెప్పవచ్చు.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు రెండు మూడు మార్పులు చేసింది. అందులో భాగంగా క్రిస్ గేల్ స్థానంలో మరొకరిని తీసుకున్నారు. గేల్ స్థానంలో ప్రపంచ కప్ ఆస్ట్రేలియా పేస్ మెన్ మిచెల్ స్టార్క్‌ను తీసుకున్నారు. గేల్, అబు నెచిమ్, అరోన్ ఫించ్ స్థానాల్లో.. మిచెల్ స్టార్క్, హర్షాల్, సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకున్నారు.