న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తన కుమార్తె శ్రీశ్రాన్వికను ఒళ్లో కూర్చోబెట్టుకుని కారు నడుపుతున్న ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోపై టీమిండియా క్రికెటర్ హార్భజన్ సింగ్ స్పందించడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.
ఈ ఫోటోపై "వారిద్దరికీ ఆశీస్సులు... సో క్యూట్" అని భజ్జీ కామెంట్ చేశాడు. ఇంతకీ భజ్జీ కామెంట్‌పై ఎందుకంత చర్చ అని అనుకుంటున్నారా? 2008లో ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా శ్రీశాంత్, హార్భజన్ సింగ్‌ల మధ్య చోటు చేసుకున్న 'Slapgate' ఇందుకు కారణం.

ఇండియన్ ప్రీమియర్‌లో భాగంగా 2008లో జరిగిన ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వీరిద్దరూ కూడా 2011లో భారత్ జట్టు వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. [శ్రీశాంత్‌కు సంబంధించిన మరిన్ని వార్తల కోసం]
అయితే ఈ ఫోటోపై మిశ్రమ స్పందన వెలువడింది. తన కుమార్తెను ఒళ్లో కూర్చోబెట్టుకుని కారు నడపడం బాధ్యతా రాహిత్యమని, చట్ట వ్యతిరేకమని కొందరు విమర్శించారు. అయితే, తాను కారును నడపడం లేదని, తమ ఇంటి కాంపౌండ్ లోపలే ఉన్న తోటలో ఓ ఫోటోకిచ్చిన ఫోజు మాత్రమే అదని శ్రీశాంత్ వివరణ ఇచ్చాడు.