ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టు ఏదైనా ఉందంటే అదని ముంబై ఇండియన్సే. ఇప్పటికి ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన ఈ జట్టు.. గత రెండు సీజన్ నుంచి మాత్రం అత్యంత చెత్తగా ఆడుతోంది. అంతకుముందు వరకు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన ఈ జట్టు.. గతేడాది అత్యంత ఘోరమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది. భారీ ధరకు కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్, రోహిత్ అత్యంత ఘోరంగా విఫలం అవుతున్నారు.
ఆర్సీబీతో ఈ ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఘోరంగా ఓడింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆ జట్టుకు ఏమాత్రం శుభారంభం దక్కలేదు. ఇషాన్ కిషన్ (10), రోహిత్ శర్మ (1), కామెరూన్ గ్రీన్ (5), సూర్యకుమార్ యాదవ్ (15) ఏమాత్రం రాణించలేదు. క్రీజులో ఉండటం కష్టం అయినట్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అలాంటి సమయంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (84 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. సీనియర్ ప్లేయర్లు ఏ బౌలర్లను ఆడలేకపోయారో వారి బౌలింగ్‌లోనే భారీ షాట్లు ఆడాడు.

పట్టుదలగా పోరాడి ముంబైకి మెరుగైన స్కోరు అందించేందుకు తాపత్రయపడ్డాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. మిగతా బ్యాటర్లు అందరినీ ఇబ్బంది పెట్టిన ఆర్సీబీ బౌలర్లు.. తిలక్ వర్మ ముందు తేలిపోయారు. అతనికి ఎలా బౌలింగ్ చేయాలో కూడా వాళ్లకు అర్థం కాలేదు.
ఈ క్రమంలోనే 84 పరుగులతో అజేయంగా నిలిచిన తిలక్ వర్మ.. ముంబైకి 171/7 స్కోరు అందించాడు. ఇది చూసిన అభిమానులు అతని ఆటకు సలాం కొట్టారు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా తిలక్ వర్మను మెచ్చుకున్నాడు. మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా తిలక్ సూపర్ అంటూ మెచ్చుకున్న సంగతి తెలిసిందే.
గతేడాది నుంచి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ మొత్తాన్ని తన భుజాలపై మోస్తున్నాడని ఈ 20 ఏళ్ల కుర్రాడికి కితాబిచ్చాడు. గతేడాది ఐపీఎల్ అరంగేట్రం చేసిన తిలక్.. ముంబై తరఫున కీరోల్ పోషించాడు. మొత్తం 14 మ్యాచుల్లో 131 స్ట్రైక్ రేటుతో 397 పరుగులు చేశాడు. ఆ సీజన్‌లో ఇషాన్ కిషన్, రోహిత్, పొలార్డ్ ఘోరంగా ఫెయిలవగా.. సూర్య సీజన్ మొత్తం ఆడలేదన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తిలక్ వర్మ ఆ టీం బ్యాటింగ్ భారం మొత్తం భుజాలపై వేసుకున్నాడు. ఈ ఏడాది కూడా అదే పాత్ర పోషించేందుకు రెడీ అయిపోయినట్లు తొలి మ్యాచ్‌లోనే చాటిచెప్పాడు.