లక్నో, బెంగళూరు మధ్య మ్యాచ్ తర్వాత రెండు జట్ల ప్లేయర్ల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఇలా గొడవ పడినందుకు కోహ్లీ, గంభీర్, నవీన్ ఉల్ హక్‌కు బీసీసీఐ ఫైన్ కూడా వేసింది. ఈ గొడవ చూసిన చాలా మంది నెటిజన్లు కోహ్లీని తెగ ట్రోల్ చేశారు. టీమిండియా మాజీ దిగ్గజాలను కోహ్లీ గౌరవించడని, అతనికి ఈగో ఎక్కువని తిట్టిపోశారు.
ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఈ గొడవపై క్రిప్టిక్ మెసేజ్ పోస్టు చేశాడు. ఈ వాగ్వాదం గురించి ఇన్‌స్టాగ్రాం స్టోరీ షేర్ చేసిన కోహ్లీ.. 'మనం వినేదంతా ఒక ఒపీనియన్, నిజం కాదు. మనం చూసేదంతా ఒక కోణమే, అది కూడా నిజం కాదు' అని కామెంట్ చేశాడు. ఇప్పుడు ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

లక్నో, బెంగళూరు మ్యాచ్‌లో జరిగిన వాగ్వాదాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లక్నో కోల్పోయిన ప్రతి వికెట్‌ను కోహ్లీ చాలా ఎగ్రెసివ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో లక్నో కోచ్ గౌతం గంభీర్ చాలా హర్ట్ అయినట్లు కనిపించాడు. ఈ క్రమంలోనే కోహ్లీ, గంభీర్ మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ గొడవకు ప్రధాన కారణం అని కొందరు చెప్తున్న ఆఫ్ఘన్ పేసర్ నవీన్ ఉల్ హక్ కూడా ఇన్‌స్టాగ్రాంలో ఒక స్టోరీ పోస్టు చేశాడు. 'నీకు ఏది దక్కాలో అదే దక్కుతుంది. అలాగే జరగాలి, జరుగుతుంది కూడా' అని పోస్టు పెట్టాడు. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కోహ్లీ, గంభీర్, నవీన్ ముగ్గురికీ బీసీసీఐ ఫైన్లు వేసింది.

వీరిలో కోహ్లీ, గంభీర్ తమ పూర్తి మ్యాచ్ ఫీజును ఫైన్‌గా కట్టాల్సి వచ్చింది. దీంతో కోహ్లీ ఏకంగా రూ.1.07 కోట్లు కట్టాల్సి వచ్చింది. గంభీర్ మ్యాచ్ ఫీజు కేవలం రూ.25 లక్షలే. ఇక నవీన్ ఉల్ హక్ తన మ్యాచ్ ఫీజులో సగం ఫైన్ కట్టాలని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో అతను రూ.1.79 లక్షలు చెల్లించనున్నాడు. దీనిపైనే నవీన్ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది.