లక్నో, ఆర్సీబీ జట్ల మ్యాచ్ తర్వాత హైడ్రామా జరిగిన సంగతి తెలిసిందే. షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే సమయంలో లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్, కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగింది. అప్పుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ మధ్యలో వచ్చి వాళ్ల గొడవ పెద్దది కాకుండా అడ్డుకున్నాడు. ఆ తర్వాత లక్నో ఓపెనర్‌తో కోహ్లీ మాట్లాడుతుండగా.. ఆ టీం కోచ్ గంభీర్ వచ్చి మేయర్స్‌ను పక్కకు తీసుకెళ్లిపోయాడు.
ఈ క్రమంలోనే గంభీర్, కోహ్లీ మధ్య కూడా హీటెడ్ వాగ్వాదం జరిగింది. అప్పుడు అమిత్ మిశ్రా మధ్యలో వచ్చి కోహ్లీని వెనక్కు నెట్టగా.. రాహుల్ తదితరులు గంభీర్‌ను వెనక్కు తీసుకెళ్లారు. ఇంత ఇష్యూ జరగడంపై బీసీసీఐ కన్నెర్ర చేసింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు ఈ రెండు జట్ల ప్లేయర్లు ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీంతో ఈ గొడవలో ముఖ్యులైన ప్లేయర్లు అందరిపైనా భారీగా జరిమానాలు విధించినట్లు ప్రకటించింది. 'ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.21 కింద లెవెల్ 2 నిబంధనను ఉల్లంఘించినట్లు గంభీర్ ఒప్పుకున్నారు. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 100 శాతాన్ని ఫైన్ వేస్తున్నాం. అలాగే కోహ్లీ కూడా లెవెల్ 2 తప్పిదం చేసినట్లు అంగీకరించాడు' అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
కోహ్లీ మ్యాచ్ ఫీజులో కూడా 100 శాతం ఫైన్ విధించినట్లు వెల్లడించింది. ఇక ఈ గొడవకు ఒక విధంగా కారణమైన అఫ్ఘాన్ పేసర్ నవీన్ ఉల్ హక్‌కు కూడా ఫైన్ వేస్తున్నట్లు తెలిపింది. అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫైన్ వేసినట్లు ప్రకటించింది. ఈ లెక్కన చూసుకుంటే కోహ్లీ రూ.1.07 కోట్లు ఫైన్ కట్టనున్నాడు. కోచింగ్ టీంలో సభ్యుడైన గంభీర్ రూ.25 లక్షలు, నవీన్ ఉల్ హక్ రూ.1.79 లక్షలు ఫైన్ చెల్లించనున్నారు.