చిన్నస్వామి స్టేడియంలో తమకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెడీ అవుతోంది. లక్నోను వాళ్ల సొంత మైదానంలో ఎలాగైనా ఓడించాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో బెంగళూరు గెలవాలంటే మూడు విషయాలపై ఆ జట్టు ఫోకస్ పెట్టాలి. లేదంటే మరో ఓటమిని మూటగట్టుకోవాల్సి వస్తుంది. అవేంటంటే..?
ఫినిష్ చేయలేని ఫినిషర్ : గతేడాది ఆర్సీబీలో చాలా కీలకంగా మారిన ప్లేయర్ దినేష్ కార్తీక్. ఫినిషర్‌గా తన బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తించిన అతను.. ఈ ఏడాది కూడా టీంలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభమైనప్పటి నుంచి డీకే తడబడుతూనే ఉన్నాడు. ఇప్పటి వరకు 8 మ్యాచుల్లో కేవలం 83 పరుగులే చేశాడు. అతని స్థానంలో యువ ప్లేయర్ అనూజ్ రావత్‌కు అవకాశం ఇస్తే బెటర్ అని చాలా మంద అభిప్రాయపడుతున్నారు.

స్పిన్ మంత్రం : ఈ మ్యాచ్ జరిగే ఏకానా స్టేడియంలో స్పిన్నర్లే కీలకం. ఈ పిచ్ నుంచి స్పిన్నర్లకు చాలా సహకారం అందుతుంది. లక్నో వద్ద అమిత్ మిశ్రా, రవి బిష్ణోయి రూపంలో అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ఆర్సీబీ కూడా వారి నుంచి ఇదే నేర్చుకుంటే బెటర్. హసరంగతోపాటు షాబాజ్ అహ్మద్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను కూడా ఆర్సీబీ చక్కగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యాను ఎదుర్కోవడంలో మ్యాక్స్‌వెల్ పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది.
మిడిలార్డర్ భయం : ఆర్సీబీని తరతరాలుగా వెంటాడుతున్న ప్రధాన సమస్య నిలకడలేని మిడిలార్డర్. మహిపాల్ లోమ్రోర్, సూయష్ ప్రభుదేశాయి వంటి ఆటగాళ్లు తమ బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే సీనియర్‌గా పేరొందిన షాబాజ్ అహ్మద్ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. లక్నో స్పిన్నర్లను వీళ్లంతా సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆధార పడుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ వంటి వాళ్లు ఈ స్పిన్ ఉచ్చులో చిక్కుకునే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో మిడిలార్డర్ కూడా ఫెయిలైతే ఆర్సీబీ ఓటమి ఖాయం అవుతుంది.