ఐపీఎల్‌లో ఆర్సీబీ బలంగా కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌ను కూడా ఆర్సీబీ అద్భుతంగా ప్రారంభించింది. ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించింది. అయితే రెండో మ్యాచ్‌లో మాత్రం ఆ జట్టుపై అంచనాలు తారుమారు అయ్యాయి. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ చిత్తుగా ఓడింది. ఈ క్రమంలో లక్నోతో జరిగే మ్యాచ్ గెలవాలన్నా.. నాకౌట్స్ చేరాలన్నా ఆర్సీబీ కొన్ని చర్యలు తీసుకోక తప్పదు. అవేంటంటే..?

డెత్ బౌలింగ్ : ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి ఆర్సీబీ దగ్గర బలమైన బౌలింగ్ ఎటాక్ ఉంది. కానీ డెత్ ఓవర్లలో వాళ్లు తేలిపోతున్నారు. దీంతో ఆర్సీబీ చాలా ఎదురు దెబ్బలు తింటోంది. ఈ ఏడాది కూడా ఇదే సమస్య ఆ జట్టును పట్టి పీడిస్తోంది. ఆర్సీబీ నెంబర్ వన్ పేసర్ మహమ్మద్ సిరాజ్.. ఇన్నింగ్స్ ఆరంభంలో అదరగొడుతున్నాడు. కానీ చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. హర్షల్ పటేల్, మిగతా బౌలర్లు అలాగే ఫెయిల్ అవుతున్నారు. ఈ పరిస్థితి మారకపోతే ఆర్సీబీకి కష్టాలు తప్పేలా లేవు.

మిడిలార్డర్ వైఫల్యాలు.. : ఏళ్లుగా చూసుకున్నా ఆర్సీబీ ఎప్పుడూ ఒకరిద్దరు బ్యాటర్లపైనే ఆధార పడుతోంది. ఈ ఏడాది కూడా కోహ్లీ, డుప్లెసిస్‌పై ఆ జట్టు బ్యాటింగ్ పూర్తిగా డిపెండ్ అయి ఉంది. చివర్లో బ్రేస్‌వెల్, దినేష్ కార్తీక్ వంటి బిగ్ హిట్టర్లు ఉన్నా కూడా.. ఆర్సీబీ మిడిలార్డర్ మాత్రం రాణించడం లేదు. కోల్‌కతా చేతిలో ఆర్సీబీ ఓటమికి మిడిలార్డర్ వైఫల్యం కూడా ఒక కారణమే. మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్ వంటి వాళ్లు పరిస్థితికి తగ్గట్లు ఆడాల్సి ఉంది. లేదంటే ఆర్సీబీ కష్టాలు కొనసాగడం ఖాయం.

మెరుగైన వ్యూహాలు : ముంబైతో మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. 14 ఓవర్లలో ఆ జట్టు 98/5 స్కోరుకు పరిమితం చేశారు. కానీ ఆ పట్టును కొనసాగించడంలో ఆర్సీబీ వ్యూహాలు సరిగా పనిచేయలేదు. దీంతో ఆ జట్టు 171 పరుగులు చేసింది. అలాగే కోల్‌కతాతో మ్యాచ్‌లో కూడా అలాగే జరిగింది. ఒకానొక సమయంలో 89/5తో ఉన్న ఆ జట్టుపై మరింత ఒత్తిడి పెంచడంలో, వికెట్లు తీసుకోవడంలో ఆర్సీబీ విఫలమైంది. అదే సమయంలో శార్దూల్ ఠాకూర్ అదరగొట్టడంతో ఆ జట్టు 205 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ క్రమంలో ఆర్సీబీ తన వ్యూహాలకు పదును పెట్టాల్సిన అవసరం ఉంది.