ఈ ఐపీఎల్‌ను ఘనంగా ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అదే జోరును కొనసాగించలేకపోయింది. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. దీంతో ఆర్సీబీ నెట్ రన్ రేట్ కూడా బాగా దెబ్బతింది. అయితే ఇక్కడి నుంచి వరుసగా మూడు మ్యాచులను తమ హోం గ్రౌండ్‌లోనే ఆర్సీబీ ఆడనుంది. వీటిలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్ కూడా ఒకటి.
ఈ క్రమంలో తాము లక్నో మ్యాచ్ కోసం గట్టిగా రెడి అవుతున్నామని, కోల్‌కతా చేతిలో ఓటమిని మర్చిపోయి రాణించాలని అనుకుంటున్నామని ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చెప్పాడు. 'జట్టులో అదే రివ్యూ పద్ధతి ఉండటమే నాకు ముఖ్యం. అది తొలి మ్యాచ్‌లో అన్నీ అనుకున్నట్లు జరిగినప్పుడైనా లేదంటే ఏదీ అనుకున్నట్లు జరగని రెండో మ్యాచులో అయినా.. ఎప్పుడైనా అలాంటి ఒక పద్ధతి ప్రకారమే ఆడాలి. మేం సరిగ్గా చేసిన పనులు, మెరుగవ్వాల్సిన అంశాలపై ఫోకస్ పెట్టడం ముఖ్యం' అని చెప్పాడు.

తమ జట్టు అంతా పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉందని, గత మ్యాచ్‌ను మర్చిపోయేలా ప్రదర్శన చేయాలని అనుకుంటున్నాం అని డుప్లెసిస్ తెలిపాడు. కేకేఆర్ మ్యాచ్‌లో తమ వైఫల్యాల గురించి చర్చించామని, అయితే మరీ ఓవర్‌గా దానిపై పని చేయలేదని వివరించాడు. 'మేం మెరుగయ్యే విషయాలపై దృష్టి పెట్టాం. గెలిచినా, ఓడినా ఇలా చేయడం ముఖ్యమని నా భావన. గత మ్యాచ్‌లా భారీ తేడాతో ఓడినప్పుడు మరీ ఎక్కువగా దాని గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు' అని తన పంథాను స్పష్టం చేశాడు.
అలాగే తర్వాతి మ్యాచ్‌లో తమ ప్రత్యర్థి లక్నో చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్న జట్టని కితాబిచ్చాడు. 'రెండు కొత్త జట్లు అద్భుతంగా ఆడుతున్నాయి. లక్నో జట్టు చాలా సమతూకంతో ఉంది. వేలంలో ఖాళీ ప్లేటుతో వెళ్లినప్పుడు ఎలాంటి జట్టు కావాలో చక్కగా నిర్మించుకునే వీలుంటుంది. ఈ జట్ల విషయంలో అదే జరిగింది. మంచి బ్యాలెన్స్ ఉన్న జట్లను తయారు చేసుకున్నారు. లక్నో చాలా మంచి జట్టు. వారిని ఢీకొట్టాలంటే మేం కూడా మా బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వాలి' అని డుప్లెసిస్ పేర్కొన్నాడు.