ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభానికి ముందు అందరూ బలమైన జట్టుగా ముద్ర వేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. విరాట్ కోహ్లీ, ఫాప్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై మరీ ఎక్కువ భారం వేస్తున్న ఈ జట్టు మిగతా ఆటగాళ్లు మాత్రం పెద్దగా రాణించడం లేదు.
ఆర్సీబీ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ కూడా ఈ ఏడాది ఫర్వాలేదనిపిస్తోంది. గాయాలతో జోష్ హాజిల్‌వుడ్, రీస్ టాప్లే వంటి ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. రజత్ పటీదార్ వంటి కీలకమైన మిడిలార్డర్ బ్యాటర్ కూడా ఐపీఎల్ ఆడటం లేదు. దీనికితోడు మిడిలార్డర్‌లో మ్యాక్స్‌వెల్ మినహా ఎవరూ ఆడటం లేదు. ఇక ఫినిషర్లుగా దినేష్ కార్తీక్, సూయష్ ప్రభుదేశాయి దారుణంగా విఫలం అవుతున్నారు.

ఈ కారణంగానే ఆర్సీబీ పెద్దగా రాణించడం లేదు. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో నాలుగు విజయాలు మాత్రమే సాధించింది. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడేందుకు రెడీ అవుతోంది. ఇప్పటి నుంచి ఈ టీం వరుసగా ఐదు ఎవే మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో ఆర్సీబీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, వాళ్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఆర్సీబీని ఎవరూ అడ్డుకోలేరని చెప్పాడు.
'టోర్నమెంట్లో ఇది మంచి ఇంట్రస్టింగ్ పార్ట్. టేబుల్‌లో మేం కూడా మంచి ఇంట్రస్టింగ్ ప్లేస్‌లో ఉన్నాం. బెంగళూరు మాకు 50-50 గ్రౌండ్. ఇప్పుడు బయట ఆడే మ్యాచుల్లో బ్యాటర్లు కూడా కష్టపడాలి. కాపాడుకోగలిగే స్కోర్ చేయాలి. అదే సమయంలో ప్రత్యర్థిని బౌలింగ్‌తో కట్టడి చేయడం కూడా ముఖ్యమే. మిడిలార్డర్ రాణించాల్సిన అవసరం ఉంది' అని అభిప్రాయపడ్డాడు.
ఇకపై ఆడే మ్యాచులు తమకు సవాల్‌గా ఉంటాయని, బౌలర్లకు పిచ్ నుంచి మంచి సహకారం లభించే అవకాశం ఉందని చెప్పాడు. కాబట్టి గెలవడానికి అవసరమైన పరుగులు చేయడం చాలా అవసరం అన్నాడు. తమ టీంలో ఉన్న కీలక ఆటగాళ్లు అందరూ రాణిస్తున్నారని డీకే తెలిపాడు. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ జాబితాల్లో తమ వాళ్లు ఉన్నారని గుర్తుచేశాడు. అందరూ కనుక క్లిక్ అయితే తమ జట్టును అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదని తేల్చిచెప్పాడు.