కొన్ని రోజుల క్రితం చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ కచ్చితంగా ఆర్సీబీ గెలుస్తుందని అనుకున్నారు. కానీ మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్ ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఓడిపోయింది.
ఈ ఓటమితో ఆర్సీబీ ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కచ్చితంగా గెలిచే మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయిందని ఫ్యాన్స్ ఏడుస్తున్న వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు లక్నో హోం గ్రౌండ్ అయిన ఏకానా స్టేడియంలో మరోసారి ఈ రెండు జట్లు తలపడేందుకు రెడీ అవుతున్నాయి. ఇటీవల ఇక్కడ జరిగిన మ్యాచుల్లో చాలా నామమాత్రపు స్కోర్లే నమోదయ్యాయి.

ఈ పిచ్ నుంచి బౌలర్లకు చాలా సహకారం లభించింది. దీంతో లక్నో బ్యాటర్లు కూడా తడబడ్డారు. ముఖ్యంగా గుజరాత్, లక్నో మధ్య జరిగిన మ్యాచ్ చూస్తే ఇక్కడ పరుగులు చేయడం ఎంత కష్టమో క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు ఆర్సీబీ బ్యాటింగ్ మరీ ఎక్కువగా కేజీయఫ్ (కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్) మీదనే ఆధారపడుతోంది. వీళ్లను కనుక లక్నో బౌలర్లు అడ్డుకుంటే.. ఆర్సీబీని ఓడించడం పెద్ద కష్టం కాదు.
అదే సమయంలో లక్నో బ్యాటింగ్ లైనప్ అంతా భారీ హిట్టర్లపై ఆధార పడుతోంది. ఈ విషయంలో లక్నోను నిలువరించడానికి ఆర్సీబీ బౌలర్లు కష్టపడాల్సిన అవసరం ఉంది. కైల్ మేయర్స్, స్టొయినిస్, పూరన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లలో మార్క్ వుడ్, అమిత్ మిశ్రాను ఎదుర్కోవడం ఎలాంటి ప్రత్యర్థులకైనా కష్టమే.
ఈ లెక్కన చూసుకుంటే లక్నోలో గెలవాలంటే రెండు జట్లు చెమటోడ్చాల్సిన అవసరం ఉంది. అయితే హోం గ్రౌండ్ అడ్వాంటేజి మాత్రం లక్నోకే ఉంది. దానికితోడు ఆర్సీబీ మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆశించినట్లు రాణించడం లేదు. కాబట్టి ఈ టీం టాపార్డర్‌ను కనుక లక్నో అడ్డుకుంటే విజయం సులభం అవుతుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశం లక్నోకే కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది.