కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోరంగా ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్లీ సొంత మైదానానికి చేరుకుంది. కేకేఆర్‌తో మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ స్పిన్ కష్టాలు చాలా స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడేందుకు ఆర్సీబీ సిద్ధం అవుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచే సత్తా ఆర్సీబీకి ఉందా? అనేది అనుమానంగా మారింది.
ఈ ఏడాది ఐపీఎల్‌ను ఆర్సీబీ ఘనంగా ప్రారంభించింది. ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించింది. దీంతో ఈ ఏడాదైనా ఆర్సీబీ కప్పు కొడుతుందని అభిమానులు అనుకున్నారు. కానీ రెండో మ్యాచులోనే ఆ ఆలోచనలు పెట్టుకోవద్దన్నట్లు అభిమానులకు ఆర్సీబీ వార్నింగ్ ఇచ్చింది. కేకేఆర్ చేతిలో ఘోరమైన ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆలౌట్ అవడమే కాదు. కేవలం ముగ్గురు స్పిన్నర్లకే తొమ్మిది వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఇప్పుడు లక్నోతో జరిగే మ్యాచ్‌లో కూడా ఇదే సమస్య ఆర్సీబీని వెంటాడుతోంది.

లక్నో ప్రస్తుతం మంచి జోరు మీద ఉంది. తాజాగా సన్‌రైజర్స్‌ను ఓడించిన ఆ జట్టు బలం కూడా స్పిన్నర్లే. రవి బిష్ణోయి, కృనాల్ పాండ్యా ఇద్దరూ ఆర్సీబీకి సమస్యగా మారే అవకాశం ఉంది. సన్‌రైజర్స్‌పై పాండ్యా ఎంతలా చెలరేగాడో అందరికీ తెలిసిందే. అలాగే కేఎల్ రాహుల్‌కు చిన్నస్వామి స్టేడియంలో ఆడటం కొత్తేం కాదు. అయితే గతేడాది లక్నో, బెంగళూరు జట్లు రెండు సార్లు తలపడగా.. రెండు సార్లూ విజయం ఆర్సీబీనే వరించింది. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా బెంగళూరు ఫేవరెట్‌గా బరిలో దిగే అవకాశం ఉంది.
కానీ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆయా జట్ల ఫామ్ చూస్తే.. ఈ మ్యాచ్‌లో లక్నోనే ఫేవరెట్ అని చెప్పాలి. ఆ టీంలో కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్ వంటి భారీ హిట్టర్లు ఉన్నారు. వీరంతా చిన్నస్వామిలోని చిన్న బౌండరీలను తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. దానికితోడు ఆర్సీబీ డెత్ బౌలింగ్ కూడా చెత్తగా ఉండటం లక్నోకు కలిసొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశం లక్నోకే ఉందని చెప్పొచ్చు.