ఐపీఎల్‌లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒకటి. ఈ టీం ఎవరితో మ్యాచ్ ఆడుతున్నా కూడా అభిమానులకు దక్కే మజానే వేరు. ఈ ఏడాది ఐపీఎల్ 16వ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ముంబైతో తలపడిన ఆర్సీబీ.. రోహిత్ సేనను చిత్తుగా ఓడించింది. అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించి 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది.
ఇప్పుడు అదే జోరుతో కోల్‌కతా చేరుకుందీ జట్టు. ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడేందుకు రెడీ అయింది. ఈ ఏడాది ఆర్సీబీ చాలా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ ఇద్దరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. దీంతో ఆ జట్టు బలం రెట్టింపైంది. ఈ క్రమంలో కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో కూడా ఆర్సీబీనే ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది.

చివరగా హోం, ఎవే ఫార్మాట్లో ఐపీఎల్ జరిగింది 2019లో అన్న సంగతి తెలిసిందే. అప్పుడు ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్, ఆర్సీబీ మధ్య హైస్కోరింగ్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ భారీ శతకంతో ఆకట్టుకున్నాడు. అతను సెంచరీ చేసిన దాని కంటే, చేసిన విధానమే అందరి మదిలో గుర్తుండిపోయింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాంటప్పుడు సెంచరీ చేయాలంటే మరో 40 బంతులు పట్టాలి కదా. లేదంటే కనీసం 30 అయినా తీసుకోవాలి కదా. కానీ కోహ్లీ అలా చేయలేదు.
ఈ మ్యాచ్‌లో తనలోని విధ్వంసకర బ్యాటర్‌ను బయట పెట్టిన కోహ్లీ.. 58 బంతుల్లోనే సెంచరీ చేసి అవుటయ్యాడు. అంటే హాఫ్ సెంచరీ నుంచి సెంచరీ చేరుకోవడానికి కోహ్లీకి కేవలం 17 బంతులే పట్టిందన్నమాట. ఆ తర్వాతి బంతికి మరో షాట్ ఆడబోయి అవుటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ చూసిన అభిమానులు ఈసారి కూడా కోహ్లీ అలాంటి విధ్వంసమే సృష్టిస్తాడా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అదే కనుక జరిగితే అభిమానులకు కన్నులపండుగే.