ఐపీఎల్ 2023లో మరో ఉత్కంఠ పోరుకు అంతా సిద్ధం అయింది. మంచి ఫామ్‌లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఢీకొట్టనుంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ నుంచి బౌలర్లకు కొంత సహకారం అందే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ స్పిన్నర్లతోపాటు పేసర్లకు కూడా కొంత మూవ్‌మెంట్ దొరుకుతుంది. మరి ఈ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసుకునే ఛాన్స్ ఉన్న బౌలర్లు ఎవరో ఒకసారి చూస్తే..
టిమ్ సౌథీ: పంజాబ్‌తో కేకేఆర్ ఆడిన మ్యాచ్‌లో సౌథీ కొంత తడబడ్డాడు. తన నాలుగు ఓవర్లలో ఏకంగా 54 పరుగులు ఇచ్చాడు. కానీ రెండు కీలక వికెట్లు కూడా తీసుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో పేసర్లకు కొంత మూవ్‌మెంట్ దొరుకుతుంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి సౌథీ శతవిధాలా ప్రయత్నిస్తాడు. అదే జరిగితే తన లైన్ అండ్ లెంగ్త్‌తో ఆర్సీబీ బ్యాటర్లను అతను ముప్పుతిప్పలు పెట్టడం ఖాయం. వికెట్లు కూడా తీసుకొని ఆర్సీబీని దెబ్బ కొట్టే ఛాన్స్ కూడా ఉంది.

మహమ్మద్ సిరాజ్: ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు. కానీ తన టైట్ బౌలింగ్‌తో ముంబై బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించాడు. మరి రెండు వైపులా స్వింగ్ అయ్యే ఛాన్స్ ఉన్న ఈడెన్ గార్డెన్స్‌లో అతను ఎందుకు తగ్గుతాడు? బంతితో ఈ మ్యాచ్‌లో సిరాజ్ చెలరేగడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు. అదే జరిగితే బెంగళూరు తరఫున ఈ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసే బౌలర్ ఇతనే.
సునీల్ నరైన్: మంచి ఫామ్‌లో ఉన్న ఆర్సీబీకి ఉన్న ఒకే ఒక సమస్య.. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడమే. స్పిన్‌ను ఆడేందుకు ఆర్సీబీ బ్యాటర్లు కొంత తడబడతారు. దీన్ని క్యాష్ చేసుకోవాలంటే సునీల్ నరైన్‌ను పవర్ ప్లేలోనే కేకేఆర్ యూజ్ చేసుకోవాలి. 2012 నుంచి ఈ జట్టుతో ఉన్న నరైన్‌కు ఈడెన్ గార్డెన్స్‌లో మంచి అనుభవం ఉంది. అదే సమయంలో పవర్ ప్లేలో భారీ స్కోరు చేసేందుకు ఆర్సీబీ బ్యాటర్లు ప్రయత్నిస్తారు. దీంతో నరైన్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడబోయి అతని బుట్టలో పడే ఛాన్స్ ఉంది.