కొన్ని రోజుల క్రితం గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ చివరి ఓవర్లో 29 పరుగులు చేయాల్సి ఉంది. అలాంటి సమయంలో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు బాది తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఇది చూసిన క్రికెట్ అభిమానులకు ఉత్సాహం ఉరకలేసింది. ఇలాంటి థ్రిల్ ఎప్పుడూ చూడలేదంటూనే రింకూ సింగ్‌ను తెగ మెచ్చుకున్నారు.
ఇదే విషయాన్ని ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ ముందు ప్రస్తావించినప్పుడు.. కోహ్లీ కూడా రింకూను తెగ మెచ్చుకున్నాడు. తాను కలలో కూడా ఇలా జరుగుతుందని ఊహించలేనని, ఇలా తాను చెయ్యగలననే ఊహ కూడా ఎప్పుడూ రాలేదని చెప్పాడు. ఈ కుర్రాళ్లు ఇంత అద్భుతంగా ఆడటం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుందని చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుతంగా ఆడి విజయం సాధించింది.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. 'ఈ కుర్రాళ్ల ఆట చూసి నేను ఆశ్చర్యపోతున్నా. ఈ ఐపీఎల్‌లో వాళ్లు చేస్తున్న పనులు నేను కూడా చెయ్యలేను. మొన్ననే రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. అది చూసి షాకైపోయా. అలాంటిది అంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఒక మ్యాచ్ గెలవడానికి వరుసగా ఐదు సిక్సర్లు కొట్టడం అంటే మాటలు కాదు. అసలు ఇది ఏ లెవెల్ ఆట అనాలి? ఇలా ఆటలో వస్తునన మార్పు చాలా గొప్పది. ఇంత ట్యాలెంట్ ఉన్న కుర్రాళ్లను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది' అని కోహ్లీ చెప్పాడు.
అలాగే టీ20 ఫార్మాట్‌లో యాంకర్ రోల్ అక్కర్లేదని చాలా మంది విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. కానీ కోహ్లీ ఈ అభిప్రాయంతో ఏకీభవించలేదు. 'యాంకర్ రోల్ కూడా ఈ ఆటలో ముఖ్యమే. ఆడే పరిస్థితులు ఎప్పుడూ ఎదుర్కోలేదు కాబట్టి.. చాలా మందికి ఈ విషయం అర్థం కాదు. వాళ్లు ఆటను భిన్నంగా చూస్తారు. పవర్‌ప్లే అయిపోగానే.. ఆ వాళ్లు స్ట్రైక్ రొటేట్ చేయడం మొదలు పెట్టారు అని అంటారు. నేను అలాంటివి ఆలోచించను. స్ట్రైక్ రేట్ గురించి ఆలోచనే రాదు. పరిస్థితి డిమాండ్ చేస్తే 230 స్ట్రైక్ రేటుతో కూడా ఆడగలను. ఎప్పుడైనా అలా నేను ఆడతా. కానీ పరిస్థితికి తగ్గట్లు ఆడటం చాలా ముఖ్యం' అని కోహ్లీ వివరించాడు.