ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్‌లో పాయింట్ల ఖాతా తెరవడానికి నానా తిప్పలూ పడుతోంది. ఆర్సబీతో జరిగిన మ్యాచ్‌లో కూడా బ్యాటింగ్ ఆ జట్టు కొంప ముంచింది. విరాట్ కోహ్లీ తప్ప మిగతా బెంగళూరు బ్యాటర్లు అందరూ విఫలం అవడంతో ఆ జట్టు అనుకున్నంత స్కోరు చెయ్యలేకపోయింది. నిర్ణీత ఓవర్లలో 174 పరుగులే చేసింది. దీంతో ఢిల్లీ ఈ మ్యాచ్ గెలిచినా గెలిచేస్తుందని ఫ్యాన్స్ అనుకున్నారు.
కానీ బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో ఢిల్లీకి వరుసగా ఐదో ఓటమి తప్పలేదు. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా ఇదే విషయం చెప్పాడు. 'దురదృష్టం కొద్దీ వరుసగా రెండు మ్యాచుల్లో లక్ష్యాలు కాపాడుకోవాల్సి వచ్చింది. చిన్నస్వామిలో అలా టార్గెట్ కాపాడుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి ఈ విజయం సాధించినందుకు మా బౌలర్లను చూస్తే చాలా గర్వంగా ఉంది' అని తన బౌలర్లను మెచ్చుకున్నాడు.

'ఈ సీజన్‌లో మేం పగలు ఆడిన మొదటి గేమ్ కూడా ఇదే. కాబట్టి 175 అంటే మంచి టార్గెట్ అనుకున్నాం. కానీ ఎక్స్‌ట్రా బ్యాటర్ వచ్చే అవకాశం ఉండటంతో కొంచెం అన్‌ఈజీ ఫీలయ్యా. కానీ ఈ స్కోరు సరిపోతుందని మా బౌలర్లు నిరూపించారు. కేవలం ఈ మ్యాచ్ అని కాదు కానీ.. ఇప్పటి వరకు మేం తొలి పవర్‌ప్లేలో చాలా బాగా బౌలింగ్ చేశాం. సిరాజ్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు' అని కొనియాడాడు.
చిన్నస్వామి పిచ్ కొంచెం స్లోగా ఉందని చెప్పిన అతను.. అలాంటప్పుడు బ్యాటింగ్ చేసే జట్టుకు మొదటి పవర్‌ప్లే చాలా ముఖ్యం అని తెలిపాడు. 'ఈ ఆరు ఓవర్లలో పాజిటివ్‌గా ఆడి, కావలసిన రన్‌రేట్ కన్నా మెరుగ్గా ఆడితే పైచేయి సాధించవచ్చు. కానీ ప్రత్యర్థికి మా బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఈ విషయంలో నమ్మశక్యం కానంత అద్భుతంగా బౌలింగ్ చేసిన మా పేసర్లకు ఈ క్రెడిట్ ఇవ్వాల్సిందే' అని పేర్కొన్నాడు.