చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో చివరకు విజయం చెన్నైనే వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 226 పరుగుల భారీ స్కోరు చేసింది. దీన్ని ఈజీగా ఛేజ్ చేసేలా కనిపించిన ఆర్‌సీబీ.. చివరకు 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (62), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (76) చెలరేగారు. కానీ కీలక సమయంలో వీళ్లిద్దరూ అవుట్ అవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది.
ఈ విజయంపై మాట్లాడిన ధోనీ.. 'ఇక్కడ మంచు ప్రభావం ఉంటుందని తెలుసు. కాబట్టి సాధారణం కన్నా కొన్ని ఎక్స్‌ట్రా పరుగులు చేయాలని అనుకుంటాం. ముందు మంచి ఆరంభం దక్కితే ఆ తర్వాత ఎలా ముందుకెళ్లాలో ఆలోచించుకోవచ్చు. ఇక్కడ మొదటి 2-3 ఓవర్లలో పేసర్లకు కొంత సహకారం లభించింది. దీంతో 165-170 పరుగులు చేసినా ఫర్వాలేదని అనుకున్నాం. అయితే అంత కన్నా అదనంగా పరుగులు చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నాం' అని చెప్పాడు.

తమ టీంలో దూబే చాలా మంచి హిట్టర్ అని, అతను పొడవుగా ఉండటంతో స్పిన్నర్లు లెంగ్త్ అడ్జస్ట్ చేసుకోవడంలో తడబడతారని ధోనీ అన్నాడు. అయితే తను రాణించగలనని దూబే తనను తానే నమ్మాల్సిన అవసరం ఉందన్నాడు. అలాగే 220 పరుగులు చేశామంటే, బ్యాటర్లు భారీ షాట్లు ఆడుతూనే ఉండాలని చెప్పాడు. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో రాణిస్తే మంచి స్కోరు చేసే అవకాశం ఉంటుందని వివరించాడు.
'ఫాఫ్, మ్యాక్సీ కనుక అవుట్ అవకపోతే.. ఆర్‌సీబీ 18 ఓవర్లలోనే గెలిచేసేది. అందుకే ప్రాసెస్‌ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి బౌలింగ్ మార్పులు చేయాలి? ఏ ఎండ్ నుంచి ఎవరితో బౌలింగ్ చేయించాలి? పిచ్‌లో వచ్చే మార్పులను నేను చాలా దగ్గరగా చూసే అవకాశం ఉంది. అంటే స్పిన్నర్లకు పిచ్ సహకరిస్తుందా? లేక పేసర్లు బౌలింగ్ చేస్తే మంచిదా? అని నాకు తెలుస్తుంది. ఇలా కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో నేనెప్పుడూ ఇన్‌వాల్వ్ అవుతూనే ఉంటా.' అని ధోనీ తెలిపాడు.
బౌలర్లకు మంచి ఫీల్డింగ్ సెటప్ పెట్టి, మంచి సలహాలు ఇవ్వగలిగితే తాను గెలిచినట్లేనని చెప్పాడు. 'డెత్ ఓవర్లు వేసేప్పుడు కుర్రాళ్లను హ్యాండిల్ చేయడం ఒక సవాల్. వాళ్లపై చాలా ఒత్తిడి ఉంటుంది కదా. ముఖ్యంగా మంచు ప్రభావం ఉంటే మరీ టెన్షన్. కుర్రాళ్లు కూడా చాలా కష్టపడుతున్నారు. ఈ విషయంలో బ్రావో స్పెషలిస్టు. అతని సలహాలు, సూచనలతో కుర్రాళ్లకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ బలం ఏంటో దానిపై ఎక్కువ పని చేయండి అనే కుర్రాళ్లకు చెప్తున్నాం' అని పేర్కొన్నాడీ కెప్టెన్ కూల్.