
ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ చెత్త రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిసి ఏకంగా 45 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో ఇచ్చాయి. దీంతో అత్యధికంగా ఎక్స్‌ట్రా పరుగులు నమోదైన మ్యాచ్‌గా ఇది చెత్త రికార్డు సాధించింది. ఈ చెత్త రికార్డు ఇంతకుముందు 38 ఎక్స్‌ట్రాలతో డెక్కన్ చార్జర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉండగా.. తాజాగా ఆ చెత్త రికార్డును ఆర్సీబీ, పీబీకేఎస్ మ్యాచ్ అధిగమించింది. ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ జట్టు ఏకంగా 23 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో పొందింది. ఇక పంజాబ్ కింగ్స్ జట్లు 22 పరుగులను ఎక్స్‌ట్రాల రూపంలో పొందింది.
దీంతో 38 ఎక్స్‌ట్రాలున్న డెక్కన్ చార్జర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ఈ జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్ 2008లో జరిగింది. ఇక పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇరు జట్లు కలిసి 38 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో సమర్పించుకున్నాయి. ఈ మ్యాచ్‌లో 2010లో జరిగింది.
ఇక తాజా మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఫాఫ్ డుప్లిసెస్ 88 పరుగులతో చెలరేగాడు. 41 పరుగులతో విరాట్ కోహ్లీ, 32 పరుగులతో దినేష్ కార్తీక్ అతనికి సహకరించారు. అనంతరం 206 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే చేధించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.