
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఉంటే ఎంతో సీరియస్‌గా ఉంటాడు. పరుగులు చేసినా.. ఫీల్డింగ్ చేసినా అదే విధంగా ఉంటాడు. అదే సమయంలో చాలా సరదాగా కూడా ఉంటాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో పాటు సహచర క్రికెటర్లను కూడా మైదానంలో తన కామెడీతో అలరిస్తుంటాడు. తనదైన ఆహాభావాలతో అందరిని నవ్విస్తుంటాడు. కొందరిని ఆటాడుకుంటాడు కూడా. అలాంటి కోహ్లీని సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అబుదాబి వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు స్పిన్నర్ యుజువేంద్ర చహల్, ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ కాసేపు ఆడుకున్నారు. కోహ్లీ తప్పిదాన్ని ఎత్తిచూపుతూ సరదాగా నవ్వుకున్నారు. విషయంలోకి వెళితే...
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన యుజువేంద్ర చహల్ బౌలింగ్‌లో బంతిని వృద్ధిమాన్ సాహా మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడాడు. సింగిల్‌ని పూర్తి చేయడంతో పాటు డబుల్ కోసం జేసన్ హోల్డర్‌ని పిలిచాడు. దాంతో వేగంగా బంతి అందుకున్న మాక్స్‌వెల్.. నాన్‌స్ట్రైక్ ఎండ్ వైపు విసిరాడు. దాన్ని అందుకునేందుకు మొదటగా చహల్ సిద్ధంగా ఉన్నాడు. అయితే వెనుక వైపు పరుగెత్తుకుంటూ వచ్చిన విరాట్ కోహ్లీ.. పక్కకి జరగమని గట్టిగా అరుస్తూ వికెట్ల సమీపానికి వచ్చాడు. దాంతో చహల్ పక్కకి వెళ్లిపోగా.. మాక్స్‌వెల్ విసిరిన త్రోని కోహ్లీ అందుకోలేకపోయాడు. కోహ్లీ పక్కనుంచే బంతి వెళ్లినా.. అతడు తొందరలో దాన్ని పట్టుకోలేకపోయాడు.
యుజువేంద్ర చహల్‌ని పక్కకి జరగమని మరీ వికెట్ల దగ్గరికి వచ్చిన విరాట్ కోహ్లీ.. బంతిని పట్టుకోకపోవడంతో గ్లెన్ మాక్స్‌వెల్ నిరాశకు గురయ్యాడు. దాంతో ఇది కూడా పట్టవా అంటూ కోహ్లీపై గట్టిగా అరిచాడు. అంతేకాకుండా పక్కనే నిల్చొని చూస్తున్న చహల్‌పై కూడా సైగలతో తన అసహనం వ్యక్తం చేశాడు. అక్కడే ఉన్న కోహ్లీ మాత్రం నవ్వుకున్నాడు. ఇక బౌలింగ్ వేసేందుకు వెళ్తున్న చహల్.. ఓ క్షణం ఆగి కోహ్లీ తరహాలో సీరియస్‌గా చూసి నవ్వుతూ వెళ్లిపోయాడు. దాన్ని చూసి కోహ్లీ, మాక్స్‌వెల్‌తో పాటు మైదానంలోని అందరూ నవ్వులుపూయించారు. మరోవైపు కామెంటేటర్లు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.
బుధవారం అబుదాబి వేదికగా చివరి బంతివరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్.. బెంగళూరుపై అద్భుత విజయాన్ని అందుకుంది. ఎస్‌ఆర్‌హెచ్ నిర్ధేశించిన 142 లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీ 6 వికెట్లు కోల్పోయి 136 పరుగులే చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ (41; 52 బంతుల్లో 4×4), గ్లెన్ మాక్స్‌వెల్ (40; 25 బంతుల్లో 3×4, 2x6) రాణించినప్పటికీ.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ (19 నాటౌట్; 13 బంతుల్లో 1×4, 1×6) చివరి వరకు క్రీజులో ఉన్నా ఫలితం లేకుండా పోయింది. భువనేశ్వర్ కుమార్ అద్భుత బౌలింగ్ కారణంగా 4 పరుగుల తేడాతో ఆర్‌సీబీని ఎస్‌ఆర్‌హెచ్ ఓడించింది.