
అబుదాబి: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో అబుదాబి వేదికగా జరుగుతున్న మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 రన్స్ చేసి.. బెంగళూరు ముందు 142 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ జాసన్ రాయ్ (44; 38 బంతుల్లో 5×4), కేన్ విలియమ్సన్ (31; 29 బంతుల్లో 4×4) పర్వాలేదనిపించారు. యువ ఆటగాళ్లు ప్రియం గార్గ్ (15), అభిషేక్ శర్మ (13), అబ్దుల్ సమద్ (1) మరోసారి నిరాశపరిచారు. సన్‌రైజర్స్ జట్టుకు మంచి ఆరంభం దక్కినా.. మిడిల్ ఆర్డర్ కారణంగా మరోసారి మోస్తరు స్కోరుకే పరిమితమైంది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా.. డాన్ క్రిస్టియన్ రెండు వికెట్లు తీశాడు.
ఈ మ్యాచులో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ (13) జార్జ్ గార్టన్ బౌలింగ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచులో అభిషేక్ ఓపెనర్ అవతారం ఎత్తాడు. ఓపెనర్ ఔట్ అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో కలిసి మరో ఓపెనర్ జేసన్ రాయ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కాసేపు నిలకడగా ఆడారు. చెత్త బంతులను మాత్రమే బౌండరీలు పంపిస్తూ.. స్ట్రైక్ రొటేట్ చేశారు. ఈ క్రమంలో మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 11.2వ బంతికి విలియమ్సన్ ఔట్ అయ్యాడు. దాంతో సన్‌రైజర్స్ జట్టు విలువైన భాగస్వామ్యానికి తెరపడింది.
కేన్ విలియమ్సన్ తర్వాత వచ్చిన బ్యాటింగ్‌కు వచ్చిన ప్రియమ్ గార్గ్ (15) ధాటిగా ఆడినా... ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. డాన్ క్రిస్టియన్ సన్‌రైజర్స్ జట్టుకు మరో షాక్ ఇచ్చాడు. గార్గ్‌తో పాటు రాయ్‌ని కూడా ఔట్ చేశాడు. ఆ వెంటనే యుజువేంద్ర చహల్.. అబ్దుల్ సమద్ (1)ను పెవిలియన్ చేర్చాడు. వృద్ధిమాన్ సాహా (10) కూడా నిరాశపరిచాడు. చివర్లలో జేసన్ హోల్డర్ (16), రషీద్ ఖాన్ (7) వేగంగా ఆడకపోవడంతో సన్‌రైజర్స్ స్వల్ప స్కోరుకే పరిమితం అయింది. దీంతో హైదరాబాద్ జట్టు ప్రత్యర్థి ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు, డేనియల్ క్రిస్టియన్ రెండు.. జార్జ్ గార్టన్, యుజువేంద్ర చాహల్ తలో వికెట్ తీశారు.