
ఎప్పుడో ఇంటికి వెళ్లిపోయారు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచుకు ముందు భారత మాజీ ఓపెనర్, స్టార్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఏకపక్షంగా ఉంటుందని అతడు అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఎద్దేవా చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన వీడియోలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... 'ఒక జట్టు మొదటి రెండు స్థానాల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తుండగా.. మరొక జట్టు ఇంటికి వెళ్లేందుకు ఎంతో అతృతతో ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ జట్టు ప్లేయర్స్ ఆడడానికి సిద్ధంగా లేరు. ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు వీసాలు, బోర్డింగ్ పాసులు సిద్ధంగా ఉన్నాయి. సన్‌రైజర్స్ ఆటగాళ్లు శారీరకంగానే టోర్నీలో ఉన్నారు. మానసికంగా ఎప్పుడో ఇంటికి వెళ్లిపోయారు' అని పేర్కొన్నాడు.

పెద్దగా అంచనాలు లేవు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచులో జేసన్ రాయ్, కేన్ విలియమ్సన్ బ్యాటింగ్‌లో విఫలమైతే.. సన్‌రైజర్స్ తక్కువ లక్ష్యానికే పరిమితమయ్యే అవకాశం ఉందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. 'సన్‌రైజర్స్ జట్టుపై నాకు పెద్దగా అంచనాలు లేవు. రాయ్, విలియమ్సన్ బ్యాటింగ్‌లో విఫలమైతే అంతేసంగతులు. ఎస్‌ఆర్‌హెచ్ తక్కువ స్కోరుకే పరిమితమవుతుంది. జట్టులో అనుభవం లేని ఆటగాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఏ జట్టు ఏమీ చేయలేదు. హైదరాబాద్ జట్టుపై ఎలాంటి నమ్మకం లేదు' అని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా విమర్శల వర్షం కురిపించాడు.

హైదరాబాద్ ఓడిపోతుంది:
'నేను ఉమ్రాన్ మాలిక్‌ను మళ్లీ తుది జట్టులో చూడాలనుకుంటున్నాను. అతనికి మళ్లీ అవకాశం ఇస్తే ఎలా బౌలింగ్ చేస్తాడని ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఉమ్రాన్ మాలిక్ వర్సెస్ విరాట్ కోహ్లీ ఆట చూడాలనుకుంటున్నా. ఈ ఇద్దరి పోరాటం చూడటానికి అద్భుతమైన యుద్ధం అవుతుంది. ఉమ్రాన్ 150 కిమీ వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్ ఫామ్‌పై నేను చాలా ఆందోళనగా ఉన్నా. రషీద్ ఖాన్ నాకు ఇష్టమైన ఆటగాడని మీకు తెలుసు. నేను అతని అటని చూడాలనుకుంటున్నా. ఏదేమైనా హైదరాబాద్ జట్టు ఈ రోజు ఓడిపోతుందని నాకు అనిపిస్తుంది' అని ఆకాశ్ చోప్రా అన్నాడు.

మిడిలార్డర్ సమస్య:
ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మిడిలార్డర్ సమస్య ఉంది. జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్ రాణించినా మిడిల్ ముంచుడుతోంది. అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, కేదార్ జాదవ్, ప్రియం గార్గ్, జాసన్ హోల్డర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. బౌలింగ్ విభాగం గతంలోలా పటిష్టంగా లేదు. భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్ భారీగా పరుగులు ఇస్తున్నారు. ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. మరోవైపు బెంగళూరు మాత్రం 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.


Click it and Unblock the Notifications












