
అబుదాబి: రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియాకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ బహుమతిని ఇచ్చాడు. తెవాటియా బ్యాటింగ్‌కు ముగ్దుడైన కోహ్లీ.. తన జెర్సీని అతడికి బహూకరించాడు. ఆ జెర్సీపై 'డియర్ రాహుల్.. బెస్ట్ విషెస్' అని రాసి ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చాడు. శనివారం సాయంత్రం రాజస్థాన్, బెంగళూరు మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. ఈ సమయంలోనే కోహ్లీ తెవాటియాకు గిఫ్ట్ ఇచ్చాడు.
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో తొలుత నెమ్మదిగా ఆడిన రాహుల్ తెవాటియా.. రాయల్స్ అభిమానులతో తిట్లు తిన్నాడు. క్రీజులో కుదురుకున్న తెవాటియా.. ఆ తర్వాత మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత 19 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసిన తెవాటియా.. తర్వాత 12 బంతుల్లోనే 45 పరుగులు బాదాడు. పంజాబ్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ వేసిన 18వ ఓవర్‌లో ఏకంగా ఐదు సిక్సర్లు బాదాడు. దీంతో తెవాటియా ఒక్కసారిగా స్టార్ అయ్యాడు.
శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ రాహుల్ తెవాటియా ఆకట్టుకున్నాడు. బెంగళూరు బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 12 బంతుల్లో 3 సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. అయితే ఛేదనలో బెంగళూరు బ్యాట్స్‌మెన్ దేవదత్ పడిక్కల్ (45 బంతుల్లో 63; 6 ఫోర్లు, ఒక సిక్సర్), విరాట్ కోహ్లీ (53 బంతుల్లో 72 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీలతో నిలకడగా రాణించడంతో రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు.
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఈ విజయంతో వచ్చిన రెండు పాయింట్లు చాలా ముఖ్యమైనవి. ఇవే కాదు. లీగ్‌లో ప్రతీ పాయింట్ చాలా కీలకమే. బలమైన ప్రత్యర్థిపై సాధించిన విజయం మా జట్టులో విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. దుబాయ్‌తో పోల్చితే అబుదాబిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది. మ్యాచ్‌లో ప్రదర్శనపై మేమంతా సంతోషంగా ఉన్నాం' అని పేర్కొన్నాడు. గత కొన్ని మ్యాచుల్లో విఫలమైన కెప్టెన్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో తిరిగి ఫామ్ అందుకున్నాడు.