
అబుదాబి: ఐపీఎల్ 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. శనివారం ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన బెంగళూరు 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుచేసింది. స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఎప్పటిలాగే మాయ చేయడం.. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ ఫామ్ కొనసాగించడం.. కెప్టెన్ విరాట్ కోహ్లీ లయ అందుకోవడంతో సునాయాస విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 19.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 158 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో బెంగళూరు మూడో విజయాన్ని అందుకుంది. 2013 సీజన్ తర్వాత బెంగళూరు తన తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు నెగ్గడం ఇదే తొలిసారి.
మ్యాచ్ విజయం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. రాజస్థాన్ రాయల్స్‌ను ట్రోల్ చేసింది. ఈ మ్యాచ్ ముందు వరకూ రాజస్థాన్ అబుదాబీలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. దీంతో శనివారం మధ్యాహ్నం మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇదే విషయాన్ని రాజస్థాన్ ట్వీట్ చేసింది. 'బెంగళూరు.. ఇది నీకోసమే?' అని కవ్వించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత రాజస్థాన్ ట్వీట్‌కు బెంగళూరు పంచ్ ఇచ్చింది. 'ఇంట్లో ఎవరైనా ఉన్నారా?.. హల్లో' అని ట్రోల్ చేసింది. పోస్టుకు విరాట్ కోహ్లీ ఫొటోను జతచేసింది. అందులో కోహ్లీ అరుస్తున్నాడు. మొత్తానికి ఇలా బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంది.
దేవదత్ పడిక్కల్ (63: 45 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్), విరాట్ కోహ్లీ (72 నాటౌట్: 53 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధ శతకాలతో రాణించడంతో 155 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 19.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. స్వల్ప లక్ష్యాన్ని పడిక్కల్, కోహ్లీ ఆడుతూపాడుతూ ఛేదించారు. ఇద్దరి నిలకడైన ఆటతీరుతో బెంగళూరును విజయం వైపు నడిపించారు. సీజన్‌లోవరుసగా నాలుగు మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్ మూడు అర్ధశతకాలు బాదడం విశేషం. అంతకుముందు చహల్ (3/24), ఇసురు ఉడానా (2/41) బౌలింగ్ ధాటికి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో మహిపాల్ లామ్రోర్ (47: 39 బంతుల్లో 1ఫోర్, 3సిక్సర్లు) టాప్ స్కోరర్.
ఐపీఎల్ 2020లో ఇప్పటివరకు విఫలమయిన విరాట్ కోహ్లీ.. హాఫ్ సెంచరీ చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. 41 బంతుల్లో అర్ధశతకాన్నందుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లడుతూ... 'కొన్నిసార్లు ఫామ్ కోల్పోతాం. దాన్ని అర్థం చేసుకోవాలి. అయితే జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తుంటే.. ఫామ్ అందుకోవడానికి చాలినంత సమయం లభిస్తుంది. ఈ మ్యాచ్‌లో దేవదత్ బాగా ఆకట్టుకున్నాడు. అతడికి అద్భుత నైపుణ్యం ఉంది. అలవోకగా కచ్చితమైన షాట్‌లు ఆడుతున్నాడు' అని అన్నాడు.