RCB VS RR: ఐపీఎల్ 2025లో భాగంగా బెంగళూరు స్టేడియం వేదికగా తాజాగా జరిగిన ఉత్కంఠ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఎట్టకేలకు విజయం సాధించింది. సొంత స్టేడియంలో వరుసగా మూడు ఓటముల తర్వాత.. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ పై గెలుపొందింది. 11 పరుగులు తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ సీజన్ లో హోమ్ స్టేడియంలో ఆర్సీబీకి తొలి విజయం. ఇదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ కు మరోసారి దురదృష్టం వెంటాడింది. గత రెండు మ్యాచుల నుంచి చేతివరకు వచ్చిన విజయాన్ని చేజార్చుకుంటోన్న ఆర్ఆర్.. ఇప్పుడు కూడా అదే పని చేసింది.
206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 194 మాత్రమే చేసింది. ఆఖరి ఓవర్లలో హెజిల్ వుడ్ మ్యాచ్ అద్భుతంగా ఆర్సీబీపై మలుపు తిప్పాడు. 4 వికెట్లు తీసి రాజస్థాన్ పతనం శాసించాడు. రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్ 19 బంతుల్లో 257 స్ట్రైక్ రేటుతో 7 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 49 పరుగులు మంచి శుభారంభం అందించాడు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 12 బంతుల్లో 2 సిక్సుల సాయంతో 16 పరుగులు చేశాడు. దూకుడు మీదున్న నితీశ్ రానా (22 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్), రియాన్ పరాగ్ (10 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2 సిక్సులు) కృనాల్ పాండ్య దెబ్బతీశాడు. అనంతరం సిమ్రాన్ హెట్మెయర్ ను (11) ఔట్ చేసి మ్యాచును ఆర్సీబీ వైపు తిప్పాడు హెజిల్ వుడ్. ధ్రువ్ జురెల్ (47), శుభమ్ దూబె (12) పరుగులు చేశారు.
ఆఖరి రెండు ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ విజయానికి 18 పరుగులు అవ్వసరమవ్వగా.. హేజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీ వైపు మ్యాచ్ మలుపు తిప్పాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్లో 17 పరుగులు కావాల్సిన నేపథ్యంలో యశ్ దయల్ వికెట్ పడగొట్టి కేవలం 5 పరుగులే సమర్పించుకున్నాడు. మొత్తంగా ఆర్సీబీ బౌలర్లలో హేజిల్ వుడ్ 4 వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్య 2, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో రాజస్థాన్‌పై ఆర్సీబీకి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 70; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ దేవ్‌దత్ పడిక్కల్ (27 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీలు బాదారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (23 బంతుల్లో 26; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆఖర్లో జితేశ్ శర్మ (10 బంతుల్లో 20*; 4 ఫోర్లు), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, వానిందు హసరంగ చెరో వికెట్ తీశారు.
