RCB VS RR: ఐపీఎల్ 2025లో భాగంగా బెంగళూరు స్టేడియం వేదికగా తాజాగా జరుగుతోన్న మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బ్యాటర్లు మంచి స్కోరు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ ముందు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. 42 బంతుల్లో ఎదుర్కొన్న కోహ్లీ.. 8 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 70 పరుగులు చేశాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దేవదత్ పడిక్కల్ 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 50 అర్థ శతకం చేశాడు. కెప్టెన్ రజత్ పటీదార్ (1) నిరాశ పరిచాడు. టిమ్ డేవిడ్ (23) రనౌట్ అయ్యాడు, జితేశ్ శర్మ (20 నాటౌట్) ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, వానిందు హసరంగ చెరో వికెట్ తీశారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీలో ఓపెనర్లు సాల్ట్, కోహ్లీ మంచి శుభారంభం అందించారు. వీరిద్దరు నిలకడ ప్రదర్శన చేస్తూ మొదటి వికెట్‌కు 40 బంతుల్లో 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొదటి రెండు ఓవర్లలో ఇద్దరూ చెరో ఫోర్ బాదారు. ఆ తర్వాత ఆర్చర్ వేసిన మూడో ఓవర్‌లో కోహ్లీ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. ఫిల్ సాల్ట్.. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్ లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో పవర్ ప్లే ముగిసేసరికి ఆర్సీబీ 59/0తో బలమైన స్కోరు చేసింది. కానీ ఆ తర్వాత హసరంగ తన తొలి ఓవర్‌లో ఫిల్ సాల్ట్‌ను పెవిలియన్ కు పంపాడు.
దీంతో దేవదత్ పడిక్కల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు కోహ్లీ. సందీప్ బౌలింగ్‌లో కోహ్లీ వరుసగా రెండు ఫోర్లు బాది.. అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో కోహ్లీకిది ఐదో హాఫ్ సెంచరీ కావడం విశేషం. అనంతరం పడిక్కల్ కూడా 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే 15 ఓవర్లకు ఆర్సీబీ 156/1 స్కోరు చేసింది. కానీ ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. కోహ్లీని ఆర్చర్ ఔట్ చేశాడు. సందీప్ ఒకే ఓవర్‌లో పడిక్కల్, రజత్ పటీదార్ (1)ను పెవిలియన్ పంపాడు. ఇక చివరి మూడు ఓవర్లలో 38 పరుగులు చేసింది ఆర్సీబీ.