Virat Kohli: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదిరే విజయాన్ని అందుకుంది. ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లల్లో ఐదింటిలో విజయం సాధించింది ఆర్సీబీ. ఈ ఐదు విజయాలు కూడా బయటి స్టేడియాల్లో వచ్చినవే. హోమ్ స్టేడియం పిచ్‌పై ఆడిన మూడు మ్యాచుల్లో ఓడింది. అయితే తాజా మ్యాచులో విరాట్ కోహ్లీ - పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గొడవ పడ్డారు!. ఇద్దరు మాట మాట అనుకుని.. ఒకరిమీదకి మరొకరు వెళ్లారు. అసలేం జరిగిందంటే?
తాజాగా ముల్లాన్‌పూర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్‌ను నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులకే కట్టడి చేసింది ఆర్సీబీ. అనంతరం ఈ స్కోర్‌ను ఏడు బంతులు మిగిలివుండగానే ఛేదించింది. ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు వరుసగా వికెట్లను కోల్పోయిన పంజాబ్ కింగ్స్... ఓ దశలో 76 పరుగులకు నాలుగు వికెట్లను పోగొట్టుకుంది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (33) మంచి శుభారంభం అందించినా మిగతా వారు చేతులెత్తేయడంతో భారీ స్కోరును చేయలేకపోయింది. మధ్యలో జోస్ ఇంగ్లీస్ (29), ఆఖరి ఆరు ఓవర్లలో శశాంక్ సింగ్ ( 31 నాటౌట్), మార్కో జాన్సన్ (25 నాటౌట్) కాస్త చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్ శర్మ 2, కృనాల్ పాండ్య 2, రొమారియో ఫెఫర్డ్ ఒక వికెట్ తీశారు.

అనంతరం ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సులంభంగానే స్కోరు చేసి టార్గెట్ ను అందుకుంది. దేవ్‌దత్ పడిక్కల్ (61; 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (73*; 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతంగా రాణించారు. ఇద్దరు కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. అయితే ఈ క్రమంలోనే మ్యాచ్ విజయం అనంతరం విరాట్ కోహ్లీ (Virat Kohli vs Shreyas Iyer) మైదానంలోనే తన చర్యలతో.. శ్రేయస్ అయ్యర్ ను టీజ్ చేశాడు. విజయం సింబల్ చూపిస్తూ.. రెచ్చిపోయాడు. దీంతో కాస్త అసహనానికి గురైన శ్రేయస్.. విరాట్ దగ్గరికి వెళ్లి కాస్త గట్టిగానే మాట్లాడినట్లు కనిపించింది. దీంతో కోహ్లీ కూడా మొదట కాస్త గట్టిగానే మాట్లాడి ఆ తర్వాత నవ్వుతూ పక్కకు తప్పుకున్నాడు. మరి నిజంగానే ఇద్దరు సీరియస్ గా చర్చించుకున్నారా? లేదా సరదాగానా? అనేది పక్కాగా తెలియలేదు.
కాగా, ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచులలో కోహ్లీ.. నాలుగు హాఫ్ సెంచరీలు బాదాడు. ఇందులో మూడు అజేయంగా సాధించినవే. అలానే ఈ 8 మ్యాచుల్లో 59, 31, 7, 67, 22, 62, 1, 73 పరుగులు చేశాడు.