ఈ సారైనా టైటిల్‌ను సాధించాలని పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 17వ సీజన్‌లో కసిగా బరిలోకి దిగింది. తొలి మ్యాచ్‌లో ఘన విజయంతో సీజన్‌ను శుభారంభం చేసింది. కానీ రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. సోమవారం బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తేడాతో పంజాబ్ పరాజయాన్ని చవిచూసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 176 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (45; 37 బంతుల్లో) టాప్ స్కోరర్. శశాంక్ సింగ్ (21*; 8 బంతుల్లో) దూకుడుగా ఆడాడు. అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లి (77; 49 బంతుల్లో) అర్ధశతకంతో సత్తాచాటాడు. ఆఖర్లో దినేశ్ కార్తీక్ (28*; 10 బంతుల్లో), మహిపాల్ లోమ్రర్ (17*; 8 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించారు.

అయితే పంజాబ్ 176 పరుగులు చేసిందంటే దానికి కారణం శశాంక్ సింగ్. 19 ఓవర్లకు పంజాబ్ స్కోరు 156/6 మాత్రమే. కానీ ఆఖరి ఓవర్‌లో శశాంక్ చెలరేగాడు. అల్జారీ జోసెఫ్ వేసిన ఈ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ బౌండరీ బాదాడు. మొత్తంగా 20 పరుగులు పిండుకున్నాడు. అయితే ఐపీఎల్ వేలంలో శశాంక్‌ను పంజాబ్ కింగ్స్ పొరపాటుగా తీసుకోవడం గమనార్హం.
వేలంలో పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా తప్పు చేసింది. మరో శశాంక్ సింగ్‌కు బదులుగా 32 ఏళ్ల శశాంక్‌ను తీసుకుంది. రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. అతడిని సొంతం చేసుకున్న అనంతరం పంజాబ్ కింగ్స్ తమ పొరపాటును గ్రహించింది. ఆ తర్వాత పరువు పోకుండా ఈ శశాంక్ సింగ్ కూడా తమ టార్గెట్ లిస్ట్‌లో కూడా ఉన్నాడని కవర్ చేసింది.
అయితే అప్పుడు ప్రీతి జింటా చేసిన తప్పు ఇప్పుడు వాళ్లక వరంలా మారింది. శశాంక్ ఫామ్‌లో ఉండటం వాళ్లకు సానుకూలాంశంగా మారింది. హిట్టర్లు లివింగ్‌స్టోన్, సామ్ కరన్, జితేశ్ శర్మ సత్తాచాటలేకపోయినా శశాంక్ జట్టును ఆదుకున్నాడు. వన్ మ్యాన్‌షోతో జట్టుకు పోరాడే స్కోరు అందించాడు.