RCB vs PBKS: ఎట్టకేలకు వర్షం తగ్గడం వల్ల ఐపీఎల్ 2025లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైపోయింది. ఈ సీజన్‌లో దాదాపు ఒకేలా ప్రదర్శన చేస్తూ ముందుకెళ్తోన్న పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. తాజా మ్యాచులో తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటివరకు ఆరేసి మ్యాచ్‌లు ఆడిన ఈ రెండు జట్లు.. నాలుగేసి విజయాలు సాధించి పాయింట్ల పట్టిలో మెరుగైన స్థానాల్లో నిలిచాయి.
ఇరు జట్లకు ఇప్పుడిది ఏడో మ్యాచ్. అయితే ఇప్పుడు వర్షం కారణంగా ఈ మ్యాచ్ ప్రారంభ సమయం ఆలస్యం అవ్వడం వల్ల.. ఓవర్లను కుదించారు. దీంతో ఇప్పుడు పూర్తి ఆట సాధ్యం కాదు. అందుకే 14 ఓవర్లకు మ్యాచును కుదించారు. మ్యాచులో భాగంగా ముందుగా టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ బ్యాటింగ్ కు దిగింది.

అతడు ఔట్.. వారిద్దరు ఇన్..
"మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది ఛేజ్ చేయడానికి అనుకూలమైన మైదానం. వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది, ఓవర్లను కుదించారు. వికెట్ ఎలా ఉంటుందనే దానిపై మాకు ఓ స్పష్టత ఉంది. మొదటి నుంచి ఇదే మా ప్రణాళిక. మ్యాక్స్‌వెల్ స్థానంలో జట్టులోకి స్టోయినిస్ వచ్చాడు. హర్ప్రీత్ బ్రార్ కూడా జట్టులోకి వచ్చాడు. సరైన ఆటగాళ్లను సరైన స్థానాల్లో ఉంచడం చాలా అవసరం." అని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు.
కాస్త గందరగోళంగా ఉంది...
రజత్ పటీదార్ కు టాస్ సమయంలో కాస్త వింత పరిస్థితి ఎదురైంది! ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో తాను కన్ఫ్యూజన్ అయినట్లు ఫన్నీగా అన్నాడు. "పరిస్థితులకు అనుగుణంగా తెలివిగా వ్యవహరించాలి. మా వంతుగా మేము బెస్ట్ గా ఆడుతాం. పిచ్ కొంచెం స్టిక్కీగా ఉంది. కానీ సర్ఫేస్ చూస్తే గట్టిగా ఉంది. భారీ స్కోర్ చేస్తామనే నమ్మకం ఉంది. మా జట్టులో ఎలాంటి మార్పులు లేవు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో మాత్రం కాస్త గందరగోళంగా ఉన్నాను." అని రజత్ పటీదార్ అన్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB):
ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, యష్ దయాల్
పంజాబ్ కింగ్స్ (PBKS):
ప్రియాంశ్ ఆర్య, నేహల్ వధేరా, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సన్, హర్ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్ లెట్, అర్షదీప్ సింగ్, యూజువేంద్ర చాహల్