RCV VS PBKS: ఐపీఎల్ 2025లో తాజాగా జరిగిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై పంజాబ్ కింగ్స్ ఓడింది. 7 వికెట్ల తేడాతో పరాజయం పొందింది. ఆర్సీబీకి ఇది ఐదో విజయం కాగా, ఎనిమిది మ్యాచులు ఆడిన పంజాబ్‌కు ఇది మూడో ఓటమి. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (22; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), సిమ్రన్ సింగ్ (33; 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) మంచి శుభారంభం అందించారు. కానీ, మిగతా బ్యాటర్లు భారీ స్కోర్లు చేయలేకపోయారు. జోష్ ఇంగ్లిస్ (29; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), శశాంక్ సింగ్ (31*; 33 బంతుల్లో), మార్కో యాన్సెన్ (25*; 20 బంతుల్లో) ఫర్వాలేదనిపించే ప్రదర్శన చేశారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్ శర్మ 2, కృనాల్ పాండ్య 2, రొమారియో ఫెఫర్డ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
అదే మా ఓటమికి కారణం..
అయితే మ్యాచ్ అనంతరం ఓటమికి గల కారణాలను చెప్పాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. అతడు మాట్లాడుతూ.. "ఈ ఓటమి చిన్నదే. నెక్ట్స్ మ్యాచ్ నుంచి తిరిగి పుంజుకుంటాం. మా బ్యాటర్లు చాలా మంది మొదటి బంతి నుంచే ఆటలోకి దిగాలనుకుంటారు. అయితే మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్ ఎలా ఉంటుందో అంచనా వేయడంలో మేం కొంత ఇబ్బంది పడుతున్నాం. మేము మంచి ఆరంభాలు సాధించినప్పటికీ వాటిని పెద్ద స్కోర్‌గా మలచలేకపోతున్నాం. డిఫెండ్ చేసుకోగలిగే స్కోరును సెట్ చేయలేకపోతున్నాం."
"ఈ మ్యాచ్ విషయానికొస్తే, మేం మంచి ఆరంభాన్ని అందుకున్నాం. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. విరాట్ తో ఆ జట్టులోని ఇతర బ్యాటర్లు మంచి ప్రదర్శన చేశారు. మేము పిచ్‌కు అనుగుణంగా ఆడాలని చర్చించుకుంటూనే ఉంటాం. మా ఇద్దరు ఓపెనర్లు కూడా చక్కటి షాట్లు ఆడగలగే వాళ్లే. వాళ్లను నెమ్మదిగా ఆడమంటే, వాళ్లకు పిచ్ ను అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. ఇకపై మేం బలమైన స్కోరు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నా మైండ్‌సెట్ బానే ఉంది. 10 పరుగులు దాటితే చాలు, బాగా రాణించగలనన్న నమ్మకం ఉంది. ఇప్పుడు మాకు 6 రోజులు బ్రేక్ వచ్చింది. మా తప్పులను సరిచేసుకుని, శారీరకంగా, మానసికంగా బలంగా తిరిగి పుంజుకుంటాం. నెక్ట్స్ మ్యాచులో ఉత్తమంగా రాణించడం చాలా ముఖ్యం" అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
