RCB VS PBKS: ఐపీఎల్ 2025లో వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతులెత్తేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో పంజాబ్ కింగ్స్ బౌలర్ల దెబ్బకు ఆర్సీబీ బ్యాటర్లు తోక ముడిచారు. వరుసగా ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ కు చేరుకుని నిరాశపరిచారు. దీంతో ఆర్సీబీ ఇన్నింగ్స్ కథ ముగిసింది. 14 ఓవర్లలో కేవలం 95 పరుగులు మాత్రమే చేశారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ వేగంగా ఆడడం వల్ల ఆర్సీబీ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. దీంతో పంజాబ్ ముందు 96 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది.
క్యూ కట్టిన బ్యాటర్లు..
ఈ మ్యాచులో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి మంచి శుభారంభం దక్కలేదు. 5 ఓవర్లలో 33 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఫిల్ స్టాల్ట్ , విరాట్ కోహ్లీ, లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ వరుసగా పెవిలియన్ చేరారు. తొలి ఓవర్ లోనే అర్షదీప్ బౌలింగ్ లో మొదటి బంతికి బౌండరి బాదిన సాల్ట్ (4).. నాలుగో బంతికి మరో భాట్ ప్రయత్నించి వికెట్ కీపర్ ఇంగ్లిస్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత అర్షదీప్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించిన కోహ్లీ( 1) పరుగుకే పెవిలియన్ చేరాడు. అనంతరం జేవియర్ బార్ట్ లెట్ బౌలింగ్ లో 3.6 ఓవర్ వద్ద ప్రియాంశ్ ఆర్యకు క్యాచ్ ఇచ్చి లివింగ్ స్టన్ (4) మూడో వికెట్ గా వెనుదిరిగాడు. చాహల్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి నేహాల్ వధరాకు క్యాచ్ ఇచ్చి జితేశ్ శర్మ(2) నాలుగో వికెట్ గా ఔట్ అయ్యాడు.

మొదట ఔట్ ఇవ్వని అంపైర్..
మార్క్ ఎన్ సన్ బౌలిగ్ లో 6.1 ఓవర్ దగ్గర రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు కృనాల్ పాండ్య. అయితే అంపైర్ మొదట ఔట్ ప్రకటించలేదు. దీంతో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు రివ్యూ కోరగా.. థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ రజత్ పటీదార్ (23) కూడా ఆరో వికెట్ గా డౌన్ అయ్యాడు. దీంతో 7.5 ఓవర్లకే ఆరు వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ.
టిమ్ డేవిడ్ మెరుపులు..
అనంతరం మార్క్ ఎస్ఎన్ బౌలింగ్ లో 8.2 ఓవర్ దగ్గర మనోజ్ భాండగే (1) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అప్పుడు రివ్యూ కోరినా.. ఆర్సీబీ ఫలితం అనుకూలంగా రాలేదు. భువనేశ్వర్ కుమార్ (8) 8వ వికెట్ గా ఔట్ అవ్వగా.. యశ్ దయాళ్ ఎల్బీడబ్ల్యూగా క్రీజును వదిలాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (50) తన బ్యాటును ఝళిపించాడు. 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో దూకుడు ప్రదర్శించాడు. దీంతో ఆర్సీబీ 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పంజాబ్ ముందు 96 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్, పెద్ద స్వామి చాహల్, హర్ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు తీశారు. బార్లెట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు