RCB VS PBKS: ఐపీఎల్ 2025లో వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓడింది. సొంతగడ్డపైనే మరోసారి ఓటమిని అందుకుంది. 5 వికెట్ల తేడాతో పరాజయం పొందింది. ఈ మ్యాచులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీని పంజాబ్ బౌలర్లు రఫ్పాడించారు. వరుసగా ఒక్కోకరిని పెవిలియన్ పంపారు. దీంతో ఆర్సీబీ ఈ సీజన్ లో మూడో ఓటమిని అందుకోవాల్సి వచ్చింది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఈ మూడు ఓటములను ఆర్సీబీ సొంతగడ్డపైనే అందుకోవడం గమనార్హం.
ఆపద్భాంధవుడు టిమ్ డేవిడ్..
వాస్తవానికి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టులో టిమ్ డేవిడ్.. ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. (50*) హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడాడు. అందుకే ఆర్సీబీ ఈ మాత్రమైన స్కోరు చేయగలిగింది. అనంతరం ఫీల్డింగ్ లోనూ రెండు కీలక క్యాచులు పట్టుకుని ఆకట్టుకున్నాడు టిమ్ డేవిడ్. అయితే బెంగళూరు ఇన్నింగ్స్ ఆడినప్పుడు.. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2, యాన్సెన్ 2, చాహల్ 2, హర్‌ప్రీత్ బ్రార్ 2, బార్ట్‌లెట్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ కు అండగా నిలబడ్డాడు నేహాల్ వధేరా. ఆఖర్లో అతడు.. 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 33* పరుగులు దంచికొట్టాడు. అందుకే విజయం పంజాబ్ జట్టుకు వరించింది. ఆర్సీబీ బౌలర్లలో హేజిల్ వుడ్ 3, భువనేశ్వర్ 2 వికెట్లు తీశారు. కాగా, పంజాబ్‌కు ఇది వరుసగా రెండో విజయం. మొత్తంగా 7 మ్యాచుల్లో 5 విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.

ఇది మాకు పెద్ద గుణ పాఠం..
మ్యాచ్ ఓటమి తర్వాత ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ మాట్లాడుతూ.. "పిచ్ స్టిక్కిగా, టు పేస్డ్ గా ఉంది. అయినా కూడా మా బ్యాటింగ్ యూనిట్‌గా ఇంకా మెరుగ్గా ఆడొచ్చు. భాగస్వామ్యాలు ఎంతో కీలకం. కానీ మేము త్వరగా వికెట్లు కోల్పోయాం. ఇది మాకు పెద్ద గుణ పాఠం. పరిస్థితుల కారణంగా మేము పడిక్కల్‌ను జట్టు నుంచి తప్పించాల్సి వచ్చింది. పిచ్ మరి అంత బ్యాడ్ గా లేదు. కాకపోతే చాలా సేపు కవర్ల కింద ఉంచటం వల్ల వాళ్ల బౌలర్లకు బాగా సాయపడింది. వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పిచ్ ఎలా ఉన్నా సరే, మేము బాగా బ్యాటింగ్ చేయాల్సింది. విజయం సాధించగలిగే స్కోర్ చేయాల్సింది. మా బౌలింగ్ యూనిట్ మంచి ప్రదర్శనే చేసింది. ఇది మాకు పెద్ద ప్లస్ పాయింట్. బ్యాటర్లు మంచి ఇంటెంట్ తో ఆడారు. అది మంచి విషయం. కొన్ని చిన్న తప్పులను సరిదిద్దుకుంటే మా బ్యాటింగ్ యూనిట్‌గా మరింత మెరుగ్గా అవుతుంది." అని రజత్ పటీదార్ పేర్కొన్నాడు.