
దుబాయ్: ముంబై ఇండియన్స్‌పై సూపర్ ఓవర్‌ను యువపేసర్ నవదీప్ సైనీ అద్భుతంగా విసిరాడని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. అత్యంత ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ ఆత్మవిశ్వాసంతో సైనీ అద్భుతమైన బంతులు వేశాడని పేర్కొన్నాడు. మొదట బెంగళూరు 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టైగా మారి సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసి 7 పరుగులే చేయగా.. ఆ తర్వాత బెంగళూరు లక్ష్యాన్ని ఛేదించింది.
సూపర్ ఓవర్లో బెంగళూరు పేసర్ నవదీప్ సైనీ ముంబై బ్యాట్స్‌మన్‌ను వణికించాడు. అత్యంత భీకర హిట్టర్లు అయిన హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్‌ను పరుగులు చేయకుండా ఆపాడు. ముంబైని 7 పరుగులకే పరిమితం చేశాడు. తొలి రెండు బంతుల్లో రెండు సింగిల్స్ ఇచ్చాడు. మూడో బంతికి పరుగులేమీ రాలేదు. నాలుగో బంతిని పొలార్డ్ బౌండరీకి తరలించాడు. ఐదో బంతికి అతడు ఔటవ్వగా.. ఆరో బంతికి బైస్ రూపంలో ఒక పరుగే ఇచ్చాడు.
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'నవదీప్ సైనీ అద్భుతమైన సూపర్ ఓవర్ వేశాడు. సూపర్ ఓవర్లో హార్దిక్, పొలార్డ్‌కు బంతులు వేయడమంటే సాధారణ విషయం కాదు. సైనీ ప్రదర్శన సూపర్. పెద్ద బౌండరీలు కావడంతో యార్కర్లు వేసేందుకు ఆత్మవిశ్వాసం పెంచుకున్నాను. ఎందుకంటే అతడికి వేగం ఉంది. అంతేకాకుండా వైడ్ యార్కర్లు బాగా వేశాడు' అని ప్రశంసించాడు.
'కీలకమైన రెండు పాయింట్లు సంపాదించుకొనేందుకు మా జట్టు కుర్రాళ్లు ఎంతో కష్టపడ్డారు. మ్యాచులో విజయం దోబూచులాడింది. చివరికి విజయాన్ని అందుకుంది. ఫీల్డింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. క్యాచులు సరిగ్గా అందుకొని ఉంటే విజయం ముందుగానే వరించేది. ఏబీ డివిలియర్స్ అద్భుతంగా ఆడాడు. ఇక వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ అమోఘం. అతనితో పవర్‌ప్లేలో బౌలింగ్ చేయించడం ఫలితాలను ఇచ్చింది' అని విరాట్ కోహ్లీ చెప్పాడు.
ఐపీఎల్ 2020లో ఇప్పటికి మూడు మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ కేవలం 18 పరుగులే చేశాడు. గత రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ 11 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. డిఫెన్సె చేయడానికే తీవ్రంగా ఇబ్బంది పడిన కోహ్లీ.. స్పిన్నర్ రాహుల్ చహర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టాప్ బ్యాట్స్‌మన్, అది టీ20 మ్యాచ్, తప్పక గెలవాల్సిన పరిస్థితి.. అయినా కోహ్లీ 11 బంతుల్లో 3 పరుగులే చేయాం అభిమానులను నిరాశపరిచింది.