RCB vs MI: బౌలింగ్ బాగుంది.. మమ్మల్ని బ్యాటర్లే ముంచేశారు! బ్యాటింగ్ పరంగా 8 పాయింట్లు ఇస్తా!!

దుబాయ్: తమ బౌలర్లు బాగా బంతులేశారని, ఓటమికి కారణం బ్యాటర్లే అని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో బ్యాటింగ్ సమస్య కొనసాగుతోందని.. ఈ విషయంపై బ్యాటర్ల అందరితోనూ మాట్లాడన్నాడు. ఇప్పుడు ముంబై జట్టు ఏ స్థితిలో ఉన్నా.. ఇకపై బాగా పుంజుకోవాల్సిన అవసరం ఉందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచులో ముంబై 54 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇన్నింగ్స్ చివరలో హర్షల్ పటేల్ హ్యాట్రిక్ వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టాడు. రోహిత్ శర్మ (43; 28 బంతుల్లో 5×4, 1×6) ఒక్కడే రాణించాడు. ఈ విజయంతో బెంగళూరు ప్లే ఆఫ్ దిశగా దూసుకెళ్లగా.. ముంబై పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి పడిపోయింది.

111 పరుగులకు ఆలౌట్:
166 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ముంబైకి ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ శుభారంభం అందించారు. తొలి రెండు ఓవర్లు కాస్త నెమ్మదిగా ఆడిన ఈ జోడి తర్వాత జోరు పెంచారు. కైల్ జేమీసన్ వేసిన మూడో ఓవర్‌లో రోహిత్ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. తర్వాత డేనియల్ క్రిస్టియన్ వేసిన ఓవర్‌లో రెండు బౌండరీలు బాదిన డికాక్ (24).. చహల్ వేసిన ఏడో ఓవర్లో ఔటయ్యాడు. మ్యాక్స్‌వెల్ వేసిన 10వ ఓవర్‌లో చివరి బంతికి రోహిత్.. క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ (9), సూర్యకుమార్ యాదవ్ (8), కృనాల్ పాండ్యా (5) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఇక 17వ ఓవర్లో హర్షల్ పటేల్ హ్యాట్రిక్ తీశాడు. హార్దిక్ పాండ్యా (3), కీరన్ పొలార్డ్ (7), రాహుల్ చహర్ (0)లను వరుస బంతుల్లో ఔట్ చేసి ముంబైకి భారీ షాక్ ఇచ్చాడు. చహల్ వేసిన 18 ఓవర్‌లో బుమ్రా (5) పెవిలియన్ చేరగా.. హర్షల్ పటేల్ వేసిన 18.1 బంతికి మిల్నే (0) ఔటవడంతో ముంబై 111 పరుగులకు ఆలౌటైంది.

మమ్మల్ని బ్యాటర్లే ముంచారు:
మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'మా బౌలింగ్ బాగుందనే అనుకుంటున్నా. ఓ దశలో బెంగళూరు 180కి పైగా స్కోర్ సాధించేలా కనిపించింది. కానీ మా బౌలర్లు పుంజుకున్నారు. ఇక మమ్మల్ని బ్యాటర్లే ముంచారు. ఈ సీజన్‌లో బ్యాటింగ్ సమస్య కొనసాగుతోంది. ఈ విషయంపై బ్యాటర్ల అందరితోనూ మాట్లాడాను. అవసరమైనప్పుడు ఎవరైనా బాధ్యత తీసుకోవాలని చెప్పాను. అయితే మా బ్యాటింగ్‌లో రెండు, మూడు వికెట్లు పడగానే బెంగళూరు బౌలర్లు మాపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా.. ఇకపై బాగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవం మాకుంది. ఈ సీజన్‌లోనే అది జరగడం లేదు' అని తెలిపాడు.

అతడిపై ఒత్తిడి తేవాలనుకోవడం లేదు:
'ఇషాన్ కిషన్ మా జట్టులో ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాడు. గత సంవత్సరం ఒక అద్భుతమైన ఐపీఎల్ ఆడాడు. అతడి సహజసిద్ధమైన బ్యాటింగ్‌ను ప్రోత్సహించేందుకే సూర్యకుమార్ కుమార్ కన్నా ముందు పంపిస్తున్నాం. అతడిపై మరీ ఒత్తిడి తేవాలనుకోవడం లేదు. ఇషాన్ కిషన్ యువ ఆటగాడు ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగులు వేస్తున్నాడు' అని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ 111 పరుగులకే ఆలౌట్ అయి దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. దాంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన పది మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో ముంబై నిలిచింది. మరోవైపు ఇప్పటివరకు ఆడిన పది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించిన బెంగళూరు 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది.

8 పాయింట్లు ఇస్తా:
'మేం గెలిచిన తీరుపై చాలా ఆనందంగా ఉంది. ఆదిలోనే దేవ్‌దత్ పడిక్కల్ వికెట్ కోల్పోయి మ్యాచ్‌ను ప్రారంభించాం. జస్ప్రీత్ బుమ్రా ముంబైకి శుభారంభం అందించాడు. అక్కడి నుంచి మ్యాచ్‌లో మేము పుంజుకున్నాం. నాతో పాటు శ్రీకర్ భరత్ బాగా ఆడాడు. అతడు మంచి సహకారం అందించాడు. దాంతో నాపై ఒత్తిడి తగ్గింది. గ్లెన్ మాక్స్‌వెల్ ఆడిన తీరు అమోఘం. అయితే మేం సాధించిన 166 పరుగులు మోస్తరు స్కోరే. ఇక ముంబై ఇన్నింగ్స్‌లో 30 పరుగుల తేడాతో మా బౌలర్లు 8 వికెట్లు పడగొట్టడం నమ్మశక్యం కానిది. ఈ ఆటలో మొత్తం మా ప్రదర్శనకు 10 పాయింట్లు ఇస్తే.. బ్యాటింగ్ పరంగా 8 పాయింట్లు ఇస్తా. ఎందుకంటే.. మేం సుమారు 20-25 పరుగులు ఎక్కువ సాధించాల్సి ఉండే' అని బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications