
దుబాయ్: ఐపీఎల్ 2021లో భాగంగా ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 54 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌తో భారీ స్కోర్‌నే చేసిన బెంగళూరు.. ఆ తర్వాత బౌలింగ్‌తోనూ ముంబైని కట్టడి చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. ఇన్నింగ్స్ చివరలో హర్షల్ పటేల్ హ్యాట్రిక్ వికెట్లు తీసి ముంబైని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. దాంతో 11 బంతులు ఉండగానే ముంబైని బెంగళూరు ఆలౌట్ చేసింది. రోహిత్ శర్మ (43; 28 బంతుల్లో 5×4, 1×6) ఒక్కడే రాణించాడు. ఈ విజయంతో బెంగళూరు ప్లే ఆఫ్ దిశగా దూసుకెళ్లగా.. ముంబై పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి పడిపోయింది. బెంగళూరు విజయంలో విరాట్ కోహ్లీ (51; 42 బంతుల్లో 3×4, 3×6), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (56; 37 బంతుల్లో 6x4, 3x6), హర్షల్ పటేల్ కీలక పాత్ర పోషించారు.
166 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ముంబైకి ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ శుభారంభం అందించారు. తొలి రెండు ఓవర్లు కాస్త నెమ్మదిగా ఆడిన ఈ జోడి తర్వాత జోరు పెంచారు. కైల్ జేమీసన్ వేసిన మూడో ఓవర్‌లో రోహిత్ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. తర్వాత డేనియల్ క్రిస్టియన్ వేసిన ఓవర్‌లో రెండు బౌండరీలు బాదిన డికాక్ (24) చహల్ వేసిన ఏడో ఓవర్లో మ్యాక్స్‌వెల్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మ్యాక్స్‌వెల్ వేసిన 10వ ఓవర్‌లో చివరి బంతికి రోహిత్.. పడిక్కల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ (9), సూర్యకుమార్ యాదవ్ (8), కృనాల్ పాండ్యా (5) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఇక 17వ ఓవర్లో హర్షల్ పటేల్ హ్యాట్రిక్ తీశాడు. హార్దిక్ పాండ్యా (3), కీరన్ పొలార్డ్ (7), రాహుల్ చహర్ (0)లను వరుస బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్ తీశాడు. చహల్ వేసిన 18 ఓవర్‌లో బుమ్రా (5) పెవిలియన్ చేరగా.. హర్షల్ పటేల్ వేసిన 18.1 బంతికి మిల్నే (0) ఔటవడంతో ముంబై 111 పరుగులకు ఆలౌటైంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆర్‌సీబీకి ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన రెండో ఓవర్‌లో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (0) వికెట్‌ని కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రీకర్ భరత్ ఫర్వాలేదనింపించాడు. బుమ్రా వేసిన నాలుగో ఓవర్‌లో విరాట్ కోహ్లీ ఓ సిక్స్, ఫోర్ బాదగా.. శ్రీకర్ భరత్ బౌండరీ కొట్టాడు. దీంతో ఆ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. అనంతరం ఆడమ్ మిల్నే వేసిన ఓవర్‌లో కోహ్లీ మరో సిక్స్, ఫోర్ బాదాడు. ప్రమాదకరంగా మారుతున్న శ్రీకర్ (32; 24 బంతుల్లో 2x4, 2x6)ని 9వ ఓవర్‌లో రాహుల్ చహర్ పెవిలియన్‌కి పంపించాడు. ఆపై బౌల్ట్ వేసిన 15వ ఓవర్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి.
ఆపై విరాట్ కోహ్లీ (51) హాఫ్ సెంచరీ బాదాడు. తర్వాతి మిల్నే వేసిన ఓవర్‌లో విరాట్ ఔటైన తర్వాత మ్యాక్స్‌వెల్ జోరు పెంచాడు. మిల్నే వేసిన 18వ ఓవర్లో ఓ సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. ఈ క్రమంలోనే గ్లెన్ మ్యాక్స్‌వెల్ (56) హాఫ్ సెంచరీ బాదాడు. 19వ ఓవర్ వేసిన బుమ్రా.. మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ (11) వరుస బంతుల్లో ఔట్ చేసి ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. బౌల్ట్ వేసిన చివరి ఓవర్‌లో షాబాబ్ అహ్మద్ (1) పెవిలియన్ చేరాడు. డాన్ క్రిస్టియాన్ (1), కైల్ జేమీసన్ (2) నాటౌట్‌గా నిలిచారు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు.. రాహుల్ చహర్, ఆడమ్ మిల్నే, బౌల్ట్ తలో వికెట్ తీశారు.