
దుబాయ్: ఐపీఎల్ 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మూడు పరాజయాల తర్వాత ఆర్‌సీబీ తిరిగి విజయాల పట్టింది. ఆదివారం ముంబై ఇండియన్స్ (ఎంఐ)తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 54 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (56; 37 బంతుల్లో 6×4, 3×6), కెప్టెన్ విరాట్ కోహ్లీ (51; 42 బంతుల్లో 3×4, 3×6) మెరవడంతో మొదట ఆర్‌సీబీ 6 వికెట్లకు 165 పరుగులు సాధించింది. ఆపై హర్షల్ పటేల్ (4/17)కు తోడుగా గ్లెన్ మ్యాక్స్‌వెల్ (2/23), యుజ్వేంద్ర చహల్ (3/11) చెలరేగడంతో ఛేదనలో ముంబై 18.1 ఓవర్లలో 111 పరుగులకే పరిమితమైంది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (43; 28 బంతుల్లో 5×4, 1×6) ఆ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఇద్దరు ప్లేయర్స్. అందులో ఒకరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కాగా.. ఇంకొకరు మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్. ఈ ఇద్దరు ఎప్పటినుంచో ఆర్‌సీబీకి ఆడుతూ.. ఎన్నో విజయాలు అందించారు. అందుకే అభిమానులు ఈ స్టార్ ప్లేయర్స్ ఆట కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు. అయితే ఐపీఎల్ 2021 రెండో దశలో ఇప్పటికే మూడు మ్యాచులు ఆడిన డివిలియర్స్ పెద్దగా పరుగులు చేయలేదు. వరుసగా విఫలమవుతున్న ఏబీ ఆటతీరుపై ఆర్‌సీబీ అభిమానులతో పాటు అతడి కొడుకు కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచులో ఏబీ డివిలియర్స్ ఆటను చూసేందుకు మిస్టర్ 360 భార్య డేనియల్, కొడుకు వచ్చారు. అయితే జస్ ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో డివిలియర్స్ ఔటవ్వగానే.. ఏబీ కొడుకు నిరాశకు లోనయ్యాడు. ఆ కోపంలో ముందున్న కుర్చీకి గట్టిగా ఓ పంచ్ ఇచ్చాడు. దాంతో అతడి చేతికి దెబ్బతగిలింది. ఇది చూసిన డేనియల్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'చిన్నోడా కాస్త జాగ్రత్త' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'శాంతం.. శాంతం' అని ఇంకొకరు ట్వీటారు.
37 ఏళ్ల ఏబీ డివిలియర్స్ ఆర్‌సీబీ ప్రధాన ఆటగాళ్లలో ఒకడు. ఆర్‌సీబీ టైటిల్ కరువును తీర్చాలంటే.. డివిలియర్స్ బ్యాట్ జులిపించాల్సి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారతదేశంలో జరిగిన ఐపీఎల్ 2021 ప్రథమార్ధంలో డివిలియర్స్ ప్రదర్శన బాగుంది. రెండు మ్యాచుల్లో ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. ఇప్పటికైనా యూఏఈ పిచ్‌లపై కూడా ఏబీడీ సందడి చేయాలని ఆర్‌సీబీ ఫాన్స్ కోరుకుంటుంన్నారు. ఐపీఎల్ టోర్నీలో ఏబీ 179 మ్యాచుల్లో 5079 పరుగులు చేశాడు. బెంగళూరు ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడి ఆరింట్లో గెలిచి.. పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరో రెండు విజయాలు సాధిస్తే.. ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం కానుంది.