
పంజాబ్, బెంగళూరు కెప్టెన్లు రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీలు కవ్వింపులకి దిగారు. మొదటగా అశ్విన్ ఈ కవ్వింపులకు పాల్పడగా.. అనంతరం అశ్విన్‌ను కోహ్లీ అనుకరించాడు. బుధవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది.
బెంగళూరు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేయగా.. ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. పేసర్ మహ్మద్ షమీ వేసిన బంతిని కోహ్లీ మిడాఫ్ దిశగా షాట్ ఆడగా .. ఫీల్డర్ మన్‌దీప్ సింగ్ క్యాచ్ పట్టాడు. దీంతో పంజాబ్ కెప్టెన్ అశ్విన్ గాల్లోకి ఎగిరి కవ్వింపు తరహాలో సంబరాలు చేసుకున్నాడు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగింది పంజాబ్ జట్టు. చివరి ఓవర్లో పంజాబ్ విజయానికి 27 పరుగులు అవసరం. 19 ఓవర్ చివరి బంతికి పూరన్ అవుట్ కావడంతో.. అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. అశ్విన్ తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్ బాదాడు. లాంగాన్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ తలమీదుగా సిక్స్ వెళ్లింది. ఇక రెండో బంతిని కూడా అశ్విన్ అదే తరహాలో షాట్ ఆడగా.. బంతి కాస్తా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ చేతుల్లోకి వెళ్లింది. వెంటనే అశ్విన్ తరహాలోనే కవ్విస్తూ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు.