
హైదరాబాద్: ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఈ సీజన్‌లో ఆర్సీబీ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఆర్సీబీ నిర్దేశించిన 203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 185 పరుగులకే పరిమితమైంది. ఛేదనలో కేఎల్ రాహుల్ 27 బంతుల్లో42 (7 ఫోర్లు, ఒక సిక్స్), క్రిస్ గేల్ 10 బంతుల్లో 23(4 ఫోర్లు, ఒక సిక్స్) పంజాబ్‌కు చక్కటి శుభారంభం ఇచ్చారు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ 21 బంతుల్లో 35 (5 ఫోర్లు, ఒక సిక్స్), డేవిడ్ మిల్లర్ 25 బంతుల్లో 24 (2 ఫోర్లు) ఫరవాలేదనిపించారు. అయితే, వీరిద్దరూ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ 28 బంతుల్లో 46 (ఫోర్, 5 సిక్సులు)తో చెలరేగాడు. పూరన్ బ్యాటింగ్ చూస్తే ఆర్సీబీ ఓటమి ఖాయమని అనుకున్నారంతా.
అందుకు కారణం మూడు ఓవర్లలో ఆర్సీబీ విజయానికి కావాల్సిన పరుగులు 36. అయితే చివరి మూడు ఓవర్లను ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది మూడో విజయం కావడం విశేషం.
పంజాబ్ టార్గెట్ 203
పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ 43 బంతుల్లో 82(3 ఫోర్లు,7 సిక్సర్లు)తో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవరల్లో 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. దీంతో పంజాబ్‌కు 203 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
మ్యాచ్ ఆరంభంలోనే జట్టు స్కోరు 35 పరుగుల వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ(13) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్‌తో కలిసి మరో ఓపెనర్ పార్దీవ్ పటేల్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించారు. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో ఆర్సీబీ 70 పరుగులు సాధించింది.
ఆ తర్వాత జట్టు స్కోరు 71 పరుగుల వద్ద పార్దీవ్ పటేల్ (43) మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ(4), అక్షదీప్ నాథ్(3) వికెట్లను వెంట వెంటనే కోల్పోవడంతో ఆర్సీబీ స్కోరులో వేగం తగ్గింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్‌తో కలిసి డివిలియర్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
ఈ క్రమంలోనే డివిలియర్స్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత డివిలియర్స్ చెలరేగాడు. బౌండరీలే లక్ష్యంగా బ్యాటింగ్ కొనసాగించాడు. మరోవైపు స్టోయినిస్ నుంచి చక్కటి సహకారం లభించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. చివరి రెండు ఓవర్లలో ఆర్సీబీ 48 పరుగులు చేసింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కావడంతో స్వల్ప మార్పులు చేశాయి. పంజాబ్ తుది జట్టులో శామ్ కర్రన్, హర్ప్రీత్ సింగ్ స్థానంలో నికోలస్ పూరన్, అంకిత్ రాజ్‌పుత్‌లకు చోటు కల్పించినట్లు అశ్విన్ చెప్పాడు.