ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగన నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. అంతేగాక నెట్‌రన్‌రేటును మెరుగుపర్చుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. షారుక్ ఖాన్ (37; 24 బంతుల్లో, 5x4, 1x6) టాప్ స్కోరర్. ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్ (2/21), విజయ్ కుమార్ వైశాక్ (2/23), మహ్మద్ సిరాజ్ (2/29) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం బెంగళూరు 13.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ డుప్లెసిస్ (64; 23 బంతుల్లో, 10x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లి (42; 27 బంతుల్లో, 2x4, 4x6) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో లిటిల్ (4/45) నాలుగు వికెట్లు తీశాడు.

అయితే ఆర్సీబీ ఛేజింగ్ థ్రిల్లర్ మూవీని తలపించింది. డుప్లెసిన్, కోహ్లి మెరుపు బ్యాటింగ్‌తో మొదట స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. 3.1 ఓవర్లలోనే బెంగళూరు 50 స్కోరు సాధించింది. రెండో ఓవర్ వేసిన లిటిల్ బౌలింగ్‌లో డుప్లెసిస్ మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. మోహిత్ శర్మ వేసిన నాలుగో ఓవర్‌లోనూ నాలుగు ఫోర్లతో 18 పరుగులు సాధించాడు.
ఈ క్రమంలో డుప్లెసిస్ 18 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. డుప్లెసిస్‌తో పాటు కోహ్లి కూడా దూకుడుగా ఆడటంతో 5.4 ఓవర్లలో ఆర్సీబీ 92/0 స్కోరుతో విజయానికి రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. కానీ ఒక్కసారిగా వికెట్లు టపాటపా నేలకూలాయి. 117 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. బెంగళూరు బ్యాటర్లు అలా వచ్చి ఇలా వెళ్లారు. కానీ లక్ష్యం చిన్నది కావడంతో ఆర్సీబీ ఊపిరిపీల్చుకుంది. స్వప్నిల్ సింగ్ (15*; 9 బంతుల్లో, 2x4, 1x6)తో కలిసి దినేశ్ కార్తీక్ (21*; 12 బంతుల్లో, 3x4) జట్టును విజయతీరాలకు చేర్చాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు పేలవారంభం లభించింది. పవర్‌ప్లేలో మూడు వికెట్లు కోల్పోయి 23 పరుగులే చేసింది. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌కు ఇదే అత్యల్ప పవర్‌ప్లే స్కోరు కావడం గమనార్హం. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన షారుక్ ఖాన్‌తో కలిసి డేవిడ్ మిల్లర్ (30; 20 బంతుల్లో, 3x4, 2x6) ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 37 బంతుల్లో 67 పరుగులు జోడించారు.
అయితే ప్రమాదకరంగా మారుతున్న మిల్లర్‌ను కర్ణ్ శర్మ 12వ ఓవర్‌లో ఔట్ చేశాడు.కాసేపటికే విరాట్ కోహ్లి మెరుపు త్రోకి షారుక్ ఖాన్ రనౌటయ్యాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 87 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. రాహుల్ తెవాతియా (35; 21 బంతుల్లో, 5x4, 2x6), రషీద్ ఖాన్ (18; 14 బంతుల్లో, 2x4, 1x6) పోరాడంతో గుజరాత్ మోస్తారు స్కోరు సాధించింది.