ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజా విసిరింది. చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. డుప్లెసిస్ (54; 39 బంతుల్లో, 3X4, 3X6) టాప్ స్కోరర్.
విరాట్ కోహ్లి (47; 29 బంతుల్లో, 3X4, 4X6), రజత్ పటిదార్ (41; 23 బంతుల్లో, 2X4, 4X6), కామెరూన్ గ్రీన్ (38*; 17 బంతుల్లో, 3X4, 3X6) సత్తాచాటారు. మిచెల్ శాంట్నర్ (1/23) పొదుపుగా బౌలింగ్ చేశాడు. అయితే ఆర్సీబీ 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, ప్లేఆఫ్స్ చేరాలంటే చెన్నైని 200 పరుగులకే కట్టడి చేయాలి. కాగా, ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఛేదనలో సీఎస్కే 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితమైంది.

రచిన్ రవీంద్ర (61; 37 బంతుల్లో, 5X4, 3X6), రవీంద్ర జడేజా (42; 22 బంతుల్లో, 3X4, 3X6), అజింక్య రహానె (33; 22 బంతుల్లో, 3X4, 1X6), ఎంఎస్ ధోనీ (25; 13 బంతుల్లో, 3X4, 1X6) పోరాడారు.ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కావాలంటే సీఎస్కేకు చివరి ఆరు బంతుల్లో 17 పరుగులు అవసరమయ్యాయి. యశ్ దయాల్ వేసిన తొలి బంతిని ధోనీ స్టేడియం బయటకు పంపించాడు. దీంతో అంపైర్లు ఆర్సీబీకి మరో బంతిని అందించారు. యశ్ ఆ తర్వాత అద్భుతంగా బౌలింగ్ చేసి ఆఖరి అయిదు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చాడు.

తడి బంతి స్థానంలో మరో బంతి రావడాన్ని యశ్ దయాల్ చక్కగా ఉపయోగించుకున్నాడు. తక్కువ వేగంతో, వైవిధ్యంగా బంతులు సంధించి జట్టును గెలిపించాడు. కాగా, విజయానంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో దినేశ్ కార్తీక్ జట్టును ఉద్దేశించి మాట్లాడాడు. ''ధోనీ భారీ సిక్సర్ బాదడం, ఆ బంతి స్టేడియం అవతల పడటం మాకు కలిసొచ్చింది. అది మాకు కొత్త బంతి అందించేలా చేసింది'' అని దినేశ్ కార్తీక్ అన్నాడు. తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఒకే విజయం సాధించినప్పటికీ, తమ జట్టు గొప్పగా పోరాడి వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌కు చేరిందని డీకే పేర్కొన్నాడు.