
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ ఈనెల 19 నుంచి ప్రారంభం కానుంది. లీగ్ ఆరంభానికి ఇంకా నాలుగు రోజులే ఉండడంతో ఆటగాళ్లు అందరూ సాధన తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ప్రాక్టీస్ మమ్మురం చేశాడు. ఇప్పటికే బ్యాటింగ్‌లో మునుపటి లయని అందుకున్న కోహ్లీ.. ఫీల్డింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఇందుకు సంబందించిన పోటోలను విరాట్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్‌కు చెందిన రెండు ఫొటోల్ని ట్విట్టర్‌లో అభిమానులతో విరాట్ కోహ్లీ పంచుకుంటూ 'ఫోకస్' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఫొటోలకు కన్ను, బాణం ఎమోజీలను పంచుకున్నాడు. ఆర్‌సీబీ ఆటగాళ్లు అందరూ ఆటపైనే పూర్తి ఫోకస్ పెట్టాలని విరాట్ చెప్పుకనే చెప్పాడు. లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేదు. అందుకే ఈసారి ఎలాగైనా టైటిల్ పట్టాలని విరాట్ కోహ్లీ చూస్తున్నాడు.
విరాట్ కోహ్లీ ఐపీఎల్ టోర్నీలోనే టాప్ స్కోరర్. 5,412 పరుగులు చేశాడు. 2019 సీజన్‌లో 14 మ్యాచ్‌లాడి.. 464 పరుగులు చేశాడు. కానీ బెంగళూరు టీమ్ కనీసం ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. అంతేకాదు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. 2016 సీజన్‌లో 16 మ్యాచ్‌లాడిన కోహ్లీ.. 973 పరుగులు చేశాడు. ఆ తర్వాత మూడు సీజన్లలోనూ కోహ్లీ 308, 530, 464 పరుగులు చేశాడు. కోహ్లీ పరుగులు చేస్తున్నా.. సారథ్యంలో మాత్రం తేలిపోతున్నాడు. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.
ఈసారి జరిగిన వేలంలో ఆర్‌సీబీ జట్టులోకి కీలక బ్యాట్స్‌మన్‌లు, బౌలర్లు వచ్చారు. వేలంలో ఆర్‌సీబీ యాజమాన్యం ఆచితూచి అడుగేసింది. ఆరోన్ ఫించ్, జోష్ ఫిలిప్పి, క్రిస్ మోరిస్, బ్యాటింగ్ విభాగంను.. డేల్ స్టెయిన్, ఆడమ్ జంపాలను తీసుకుని బౌలింగ్ విభాగాలను పటిష్టం చేసింది. ఇక ఆరంభ మ్యాచ్‌ల్లో సాధ్యమైనన్ని ఎక్కువ విజయాలు సాధిస్తేనే బెంగళూరు కథ మారుతుంది. ఈసారి కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది.
జట్టు:
ఆరోన్ ఫించ్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, జోష్ ఫిలిప్పె, గుర్‌కీరత్ సింగ్, పార్థివ్ పటేల్, మొయిన్ అలీ, వాషింగ్టన్ సుందర్, పవన్ నేగి, శివమ్ దూబె, క్రిస్ మోరిస్, పవన్ దేశ్‌పాండే, షాబాజ్ అహ్మద్, ఉమేశ్యాదవ్, యుజువేంద్ర చహల్, మొహమ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, డేల్ స్టెయిన్, ఆడమ్ జంపా, ఉరుసు ఉడాన.